కరోనా మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే కొలుకుంటున్న ప్రపంచానికి మరో కొత్త వేరియంట్ రూపం భయభ్రాంతుకు గురిచేస్తోంది. ఒమిక్రాన్ సబ్ వేరియంట్ అయిన EG.5.1 తొలి కేసు ఇంగ్లాండ్‌లోనే నమోదైంది. ఆ తర్వాత ఈ కరోనా కొత్త వేరియంట్ వేగంగా వ్యాపిస్తోందని ఇంగ్లాండ్ వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. ప్రతి 7 కరోనా కేసుల్లో ఒక ఎరిక్ వేరియంట్ ఉంటోందని చెప్పింది. ఈ వేరియంట్ కట్టడికి చర్యలు చేపడుతున్నట్లు తెలిపింది. ఈ వేరియంట్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
గత వారం రోజుల్లో శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్న వారికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా దాదాపు 5.4 శాతం మందికి కోవిడ్-19కి పాజిటివ్‌గా తేలినట్లు అక్కడి ఆరోగ్య శాఖ తెలిపింది. జూలైలో ఎరిస్ కేసులు 11.8 శాతంగా ఉన్నాయి. ఒమిక్రాన్ సబ్ వేరియంట్ ఎరిస్ తొలి కేసు హోరిజోన్ స్కానింగ్‌లో జూలై 3వ తేదీన బయటపడింది. కాగా యూరప్, ఆసియాతో పాటు ఉత్తర అమెరికాలో కూడా ఎరిస్ తన ఉనికిని చాటుతోన్నట్లు వార్తలొస్తున్నాయి.