Niger Crisis: నైగర్‌పై 15 దేశాల రణ నినాదం

ప్రజాస్వామ్య ప్రభుత్వానికి అధికారం అప్పగించాలని నైగర్‌ సైనిక ప్రభుత్వానికి ఎకోవాస్‌ అల్టిమేటం... ప్రవాసీయులకు భారత విదేశాంగ శాఖ హెచ్చరిక;

Update: 2023-08-12 04:30 GMT

పశ్చిమ ఆఫ్రికా దేశమైన నైగర్‌(Niger)ను యుద్ధ మేఘాలు(war) కమ్మేస్తున్నాయి. ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూలదోసి అధికారాన్ని చేజిక్కించుకున్న సైన్యంపై పశ్చిమ ఆఫ్రికా దేశాలు ఆగ్రహంగా ఉన్నాయి. నైగర్‌లో సైనిక తిరుబాటుపై చర్చించేందుకు సమావేశమైన 15 దేశాల పశ్చిమ ఆఫ్రికా ప్రాంతీయ కూటమైన ఎకోవాస్‌(ECOWAS) నైగర్‌ సైనిక ప్రభుత్వానికి తీవ్ర హెచ్చరికలు పంపింది. వారం రోజుల్లో నైగర్‌ అధ్యక్షుడు మహ్మద్‌ బజౌమ్‌కు తిరిగి అధికారం అప్పగించకపోతే యుద్ధం తప్పదని(Military Intervention) వార్నింగ్‌ ఇచ్చింది. నైగర్‌పై సైనిక చర్యకు దిగుతామన్న కూటమి హెచ్చరికలతో ఆ దేశ సైనిక ప్రభుత్వం అప్రమత్తమైంది. నైగర్‌ సరిహద్దులను, గగన తలాన్ని మూసేసింది.


ఆఫ్రికా దేశమైన నైగర్‌లో పరిస్థితులు నానాటికి దిగజారుతున్నాయి. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన అధ్యక్షుడు మహమ్మద్‌ బజూమ్‌(democratically elected president Mohamed Bazoum.)ను అధికారం నుంచి పడగొట్టి ఆయన భద్రతా వ్యవహారాల చీఫ్‌ ఒమర్‌ చియానీ పీఠం అధిష్ఠించడం ఈ చిన్న దేశాన్ని యుద్ధం దిశగా నడిపిస్తోంది. ఇప్పటికే అధ్యక్షుడు బజూమ్‌ను సైనిక దళాలు అరెస్ట్‌ చేశాయి.ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన మహ్మద్‌ బజౌమ్‌కు వారం రోజుల్లో అధికారం అప్పగించాల్సిందేనని లేకుంటే సైనిక చర్యకు వెనుకాడబోమని ఎకోవాస్‌ కూటమి హెచ్చరించడం పరిస్థితిని మరింత దిగజార్చింది. ఏ క్షణంలోనైనా బాంబులు విరుచుకుపడే అవకాశం ఉండడంతో నైగర్‌ ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.


ఎకోవాస్‌ కూటమి హెచ్చరికతో విదేశీ శక్తులు దాడులకు సిద్ధం అవుతున్నాయని నైగర్‌ సైనిక పాలకులు తమ దేశ గగనతలాన్ని మూసివేశారు. తమ దేశ గగనతలంపై ఎగరాలని ఎవరైనా ప్రయత్నిస్తే తమ ప్రతిస్పందన వారి ఊహకు కూడా అందదని నైగర్‌ కర్నల్‌ మేజర్‌ అమడౌ అడ్రామనే హెచ్చరించారు. ఇది తమ అంతర్గత వ్యవహారమని, ఇందులో ఇతరులు జోక్యం చేసుకోవద్దని.. చేసుకుంటే ప్రతీకారం తీవ్రంగా ఉంటుందని ఆయన పశ్చిమ ఆఫ్రికా దేశాలను హెచ్చరించారు. అధికారం దక్కించుకోగానే సైనిక ప్రభుత్వం రాజ్యాంగాన్ని రద్దు చేసింది. దేశవ్యాప్తంగా అన్ని సంస్థల కార్యకలాపాలను నిలిపివేసింది. దేశ సరిహద్దులను కూడా మూసేసింది. ఇటు సైనిక పాలనలో ఉన్న మాలి, బుర్కినా ఫాసో ప్రభుత్వాలు నైగర్‌ సైనిక పాలకులకు మద్దతు తెలిపాయి. నైగర్‌పై ఎటువంటి సైనిక చర్య చేపట్టినా అది బుర్కినాఫాసో, మాలిలపై యుద్ధంగానే పరిగణిస్తామని హెచ్చరించాయి.


నైగర్‌పై పశ్చిమ ఆఫ్రికా దేశాలు దండయాత్ర చేసే అవకాశం ఉండడంతో ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. భారత్‌ సహా చాలా దేశాలు తమ పౌరులను అప్రమత్తం చేశాయి. శాంతిభద్రతలపై నీలినీడలు కమ్ముకున్న వేళ వెంటనే నైగర్‌లోని భారతీయులకు విదేశాంగ శాఖ(India's Ministry of External Affairs ) కీలక సూచనలుచేసింది. నైగర్‌లో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అక్కడ ఉండాల్సిన అవసరం లేని భారతీయులు వీలైనంత త్వరగా దేశం వీడాలని(India asks citizens to leave African country) విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్‌ బాగ్చీ విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం నైగర్‌ గగనతలాన్ని అక్కడి సైనిక ప్రభుత్వం మూసివేసిందన్న విషయాన్ని గుర్తుంచుకుని భూ మార్గంలో సరిహద్దులను దాటే క్రమంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఇప్పట్లో నైగర్‌కు వెళ్లాలని భావిస్తున్న భారతీయులు కూడా పునరాలోచించుకోవాలని సూచించింది. ఫ్రాన్స్‌, ఇటలీ, స్పెయిన్‌ దేశాలు తమ పౌరులను నైగర్‌ నుంచి తరలిస్తున్నాయి.

Tags:    

Similar News