Elon Musk: ట్రంప్‌పైనే హత్యాయత్నాలు ఎందుకు..? మస్క్‌

వాళ్లపై హత్యాయత్నాలు ఎందుకు జరగట్లేదో అంటున్న స్పేస్‌ఎక్స్‌ అధినేత ఎలాన్‌ మస్క్‌;

Update: 2024-09-16 05:30 GMT

 అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌  పై కాల్పుల యత్నం జరగడం యావత్‌ ప్రపంచాన్ని ఉలిక్కిపాటుకు గురిచేసింది. ఈ ఘటనపై స్పేస్‌ఎక్స్‌, ‘ఎక్స్‌’ సంస్థల అధినేత ఎలాన్‌ మస్క్‌ స్పందిస్తూ డెమోక్రాట్‌ నేతలపై పరోక్షంగా అనుమానాలు వ్యక్తం చేశారు.

‘‘అమెరికా అధ్యక్షుడు బైడెన్‌, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ను హత్య చేసేందుకు ఎవరూ ప్రయత్నించడం లేదు’’ అంటూ సందేహం వ్యక్తంచేస్తున్న ఎమోజీని జత చేశారు. ట్రంప్‌నే ఎందుకు చంపాలనుకుంటున్నారని ఓ ఎక్స్‌ యూజర్‌ చేసిన పోస్ట్‌పై మస్క్‌ ఈవిధంగా స్పందించారు. 

మాజీ అధ్యక్షుడిపైనే ఎందుకు మర్డర్‌ అటెంప్ట్‌ జరుగుతోందని సందేహం వ్యక్తం చేశారు. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ను చంపేందుకు ఎవరూ ప్రయత్నించడం లేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ‘వారు డొనాల్డ్‌ ట్రంప్‌ను ఎందుకు చంపాలనుకుంటున్నారు..?’ అని ఎక్స్‌ వినియోగదారు అడిగిన ప్రశ్నకు మస్క్‌ సమాధానమిస్తూ.. ‘అమెరికా అధ్యక్షుడు బైడెన్‌, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ను హత్య చేసేందుకు ఎవరూ ప్రయత్నించడం లేదు’ అంటూ సందేహం వ్యక్తం చేస్తున్న ఎమోజీని జత చేశారు. ప్రస్తుతం మస్క్‌ ట్వీట్‌ వైరల్‌గా మారింది. నవంబర్‌ 5న జరిగే అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌కు ఎలాన్‌ మస్క్‌ పూర్తి మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇటీవలే ట్రంప్‌ను మస్క్‌ ప్రత్యేకంగా ఇంటర్వ్యూ కూడా చేశారు.

కాగా, ఫోరిడాలోని వెస్ట్‌ పామ్‌ బీచ్‌లో ఉన్న తన గోల్ఫ్‌ కోర్టులో ట్రంప్‌ గోల్ఫ్‌ ఆడుతుండగా ఓ వ్యక్తి అనుమానాస్పదంగా తుపాకీతో సంచరించాడు. దీంతో సీక్రెట్‌ సర్వీస్‌ ఏజెంట్లు అతనిపై కాల్పులు జరిపారు. వెంటనే ట్రంప్‌ను సురక్షిత ప్రాంతానికి తరలించారు. అమెరికా కాలమానం ప్రకారం ఆదివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్టు సమాచారం. అయితే కాల్పుల ఘటన అనంతరం ట్రంప్‌ సురక్షితంగానే ఉన్నారని, ప్రస్తుతానికి ఇంతకన్నా వివరాలేవీ లేవని ఆయన ప్రచార బృందం అధికార ప్రతినిధి స్టీవెన్‌ చెంగ్‌ తెలిపారు. ట్రంప్‌ క్షేమమేనని ఆయన భద్రత వ్యవహారాలు చూసే సీక్రెట్‌ సర్వీస్‌ విభాగం కూడా ధ్రువీకరించింది. ట్రంప్‌ను లక్ష్యంగా చేసుకునే కాల్పులు జరిగాయా అనే కోణంలో విచారణ చేస్తున్నట్టు అధికారులు తెలిపారు.

ట్రంప్‌ పై రెండు నెలల క్రితమే హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. జూలై 13న పెన్సిల్వేనియాలోని బట్లర్‌ పట్టణంలో ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తుండగా థామస్‌ మాథ్యూ క్రూక్‌ అనే వ్యక్తి సమీపంలోని గోడౌన్‌ మీదినుంచి ఆయనపై కాల్పులు జరిపాడు. దీంతో ఆయన కుడి చెవిని తాకుతూ తూటా దూసుకెళ్లింది. ట్రంప్‌ రక్తమోడుతూనే అమాంతం డయాస్‌ కిందకు ఒరిగి తనను తాను కాపాడుకున్నారు. నాటినుంచి ఆయనకు భద్రతను మరింత పెంచారు. ఆ తర్వాత ట్రంప్‌ ర్యాలీలో మరోసారి భద్రతా వైఫల్యం బయటపడింది.

గత నెల 30న పెన్సిల్వేనియాలోని జాన్స్‌టౌన్‌ లో జరిగిన ప్రచార ర్యాలీలో ఓ దుండగుడు వేదికవైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మద్దతుదారులను ఉద్దేశించి ట్రంప్‌ స్టేజ్‌పై మాట్లాడుతున్నారు. ఆ సమయంలో ఓ దుండగుడు వేగంగా స్టేజ్‌ వైపు దూసుకొచ్చాడు. దాదాపు మీడియా పాయింట్‌ వరకూ వచ్చేశాడు. అప్రమత్తమైన పోలీసులు వెంటనే అతడిని చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు.

Tags:    

Similar News