North Korea : తగ్గేదే లేదంటున్న కిమ్
సీక్రెట్గా నిఘా ఉపగ్రహ ప్రయోగానికి సిద్ధమవుతున్నారు అంటున్న సౌత్ కొరియా;
నిఘా ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు ఉత్తర కొరియా మరోసారి సిద్ధమవుతున్నట్లు దక్షిణ కొరియా చెబుతోంది. మే నెలలో చేపట్టిన మొదటి ప్రయోగం విఫలమైన నేపథ్యంలో , గతంలో విఫలమైన నిఘా ఉపగ్రహం ప్రయోగాన్ని మరోసారి చేపట్టేందుకు ఉత్తర కొరియా సిద్ధమవుతోందా అంటే అవుననే సమాధానం చెబుతోంది దక్షిణ కొరియా. దీంతోపాటు వచ్చే వారం అమెరికా, దక్షిణ కొరియాలు చేపట్టనున్న సంయుక్త సైనిక విన్యాసాలకు నిరసనగా.. ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాలూ నిర్వహించే అవకాశం ఉందని పేర్కొంది.
సెప్టెంబరు 9 జాతీయ దినోత్సవంపురస్కరించుకుని.. ఆగస్టు చివర్లో లేదా, సెప్టెంబరు ప్రారంభంలో ఉత్తర కొరియా తన నిఘా ఉపగ్రహాన్ని ప్రయోగించే అవకాశం ఉంది. దీని కోసం రాకెట్ ఇంజిన్‌ను పరీక్షిస్తోంది. ఉపగ్రహ సమాచారాన్ని స్వీకరించేందుకు నేలపై అదనపు యాంటెన్నా కూడా ఏర్పాటు చేసింది అంటూ దక్షిణ కొరియా నిఘా విభాగం తమ చట్టసభ్యులకు సమాచారం అందించింది. అంతే కాదు ఖండాంతర క్షిపణి ఉత్పత్తి కేంద్రాల వద్ద పెద్దఎత్తున కార్యకలాపాలను గుర్తించినట్లు తెలిపింది.
మే నెల చివర్లో ఒక నిఘా ఉపగ్రహాన్ని ప్రయోగించాలన్న ఉత్తర కొరియా ప్రయత్నం విఫలమైన విషయం తెలిసిందే. రెండు దశల అనంతరం రాకెట్ ఇంజిన్‌లు థ్రస్ట్‌ను కోల్పోవడంతో కొరియా ద్వీపకల్పంలోని సముద్ర జలాల్లో వీటి శకలాలు పడ్డాయి. అయితే ఈ ఉపగ్రహ శకలాలు ఎక్కడ తమ మీద పడతాయేమోనని దక్షిణ కొరియా రాజధాని సియోల్‌కు చెందిన అధికారులు ఎటువంటి కారణం చెప్పకుండా నగరంలోని పౌరులందరినీ ఖాళీ చేయించారు. అమెరికా, దాని భాగస్వాముల సైనిక కదలికల పర్యవేక్షణ కోసం నిఘా ఉపగ్రహాన్ని సిద్ధం చేసినట్లు అప్పట్లో ప్రకటించింది కిమ్ సర్కార్. ఈ ఉపగ్రహం సైనికుల కదలికలను, యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు వంటి వాటిని గుర్తించగలదన్నారు. తాజాగా మరోసారి ఇలాంటి ఉపగ్రహ ప్రయోగానికి సిద్ధమవుతున్నట్లు ఎన్‌ఐఎస్ తెలిపింది. మరోవైపు.. అమెరికా, దక్షిణ కొరియాల సైనిక విన్యాసాలకు ప్రతిగా ఉ.కొరియాలో తయారైన కొత్త ఆయుధాలతో యుద్ధ విన్యాసాలు చేపట్టాలని కిమ్ ఇప్పటికే తన సైన్యాన్ని ఆదేశించారు.