Titan submarine: ప్రమాదం జరిగిన 10 రోజులకే మరో టూర్
రండి టైటానిక్ శిధిలాలు చూపిస్తాం అంటూ యాడ్ ఇచ్చిన ఓషన్ గేట్.;
సముద్ర గర్భంలో టైటాన్ మినీ జలాంతర్గామి పేలిపోయింది. నిన్న గాక మొన్న శిధిలాలు ఒడ్డుకి చేరుకున్నాయి. దర్యాప్తు ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇంతలోనే ఓషన్‌గేట్ సంస్థ మళ్లీ టైటానిక్ శకలాలు చూసొద్దాం రమ్మంటూ యాడ్ ఇచ్చింది.
అట్లాంటిక్ మహా సముద్రంలో 13 వేల అడుగుల లోతులో ఉన్న టైటానిక్ నౌక శిథిలాలను చూసేందుకు ఐదుగురితో వెళ్లి గల్లంతైన టైటాన్ సబ్‌మెర్సిబుల్ కథ విషాదాంతమైన విషయం తెలిసిందే. తీవ్ర పీడనంతో మినీ జలాంతర్గామి పేలిపోయి, ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. శకలాలు నిన్న గాక మొన్న తీరాన్ని కూడా చేరాయి. ఇదంతా జరిగి పది రోజులు కూడా కాకముందే సంస్థ మరోసారి సాహస యాత్రకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
ఓషన్‌గేట్ అమెరికాకు చెందిన అండర్‌వాటర్ టూరిజం కంపెనీ. 1912లో అట్లాంటిక్ మహాసముద్రంలో మునిగిపోయిన టైటానిక్ షిప్ శిథిలాలను దగ్గరి నుంచి చూపించేందుకు టూర్ లను నిర్వహిస్తోంది. దీనికోసం ఓ చిన్న జలాంతర్గామిని వినియోగిస్తోంది. ఇందులో ముగ్గురు గెస్టులు, ఒక పైలట్, మరో నిపుణుడు.. మొత్తం ఐదుగురు ప్రయాణించవచ్చు. 22 అడుగులు పొడవున్న ఈ మినీ జలాంతర్గామి 10,431 కిలోల బరువు ఉంటుంది. ఇది 4,000 మీటర్ల లోతు వరకు వెళ్లగలదు. ఈ యాత్రలో 400 మైళ్ల దూరం ప్రయాణిస్తారు. టైటానిక్ శకలాలను చూసేందుకు వెళ్లే ఈ ట్రిప్ కు టికెట్ ధర 2.50 లక్షల డాలర్లు. అంటే మన కరన్సీ ప్రకారం రూ.2కోట్లు పైనే.
ఇక యాడ్ విషయానికి వస్తే, టైటానిక్ శిధిలాలు చూడటానికి వచ్చే ఏడాది రెండు ట్రిప్‌లు నిర్వహిస్తున్నామని ఓషన్‌గేట్ తమ వెబ్‌సైట్‌లో ప్రకటించింది. దీని ప్రకారం 2024 జూన్ 12వ తేదీ నుంచి జూన్ 20 మధ్య, అలాగే జూన్ 21 నుంచి జూన్ 29 మధ్య రెండు ట్రిప్పులు ప్లాన్ చేసినట్లు ఓషన్‌గేట్ పేర్కొంది. అలాగే ఒక సబ్ పైలట్ పొజిషన్ కోసం కూడా యాడ్ ఇచ్చింది. అయితే, ఇంతటి ఘోర విషాదం జరిగి పట్టుమని పది రోజులు కూడా కాకముందే మరోసారి సాహసయాత్ర అంటూ ప్రకటనలు ఇవ్వడంపై నెటిజన్లు మండిపడుతున్నారు.
ఇక టైటాన్ మినీ జలాంతర్గామి శకలాలను సముద్ర గర్భం నుంచి కెనడాలోని సెయింట్ జాన్స్ ఓడరేవుకు బుధవారం తీసుకొచ్చినట్టు అమెరికా కోస్ట్‌గార్డ్ దళాలు వెల్లడించాయి. చనిపోయిన ఐదుగురు పర్యాటకుల మృతదేహాల అవశేషాలను టైటాన్ శకలాల నుంచి అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నాయి.