K P Oli: నేను ఎక్కడికీ పారిపోను: నేపాల్ మాజీ ప్రధాని ఓలి
ఎలాంటి ఆధారం లేని ప్రభుత్వానికి దేశాన్ని అప్పచెబుతానా అని నిలదీత
తాను దేశం విడిచి ఎక్కడకీ పారిపోనని నేపాల్ మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీ స్పష్టం చేశారు. ఇటీవల జెన్ జెడ్ ఆందోళనల నేపథ్యంలో ఆయన దేశం వీడి వెళ్ళనున్నట్లు ప్రచారం జరగడంతో ఆయన స్పందించారు. ఎటువంటి ఆధారం లేని ఈ ప్రభుత్వానికి దేశాన్ని అప్పగించి తాను పారిపోతానని ఎలా అనుకుంటున్నారని ఆయన ప్రశ్నించారు. ప్రస్తుత ప్రభుత్వం తన భద్రతను, అధికారిక హక్కులను రద్దు చేయడానికి ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు.
ఎవరికీ భయపడేది లేదని, దేశంలోనే ఉండి రాజకీయ పోరాటాన్ని కొనసాగిస్తానని ఆయన స్పష్టం చేశారు. దేశంలో శాంతిభద్రతలు, రాజ్యాంగ పరిపాలనకు ఎటువంటి చట్టబద్ధత లేదని ఆయన విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వం ప్రజల తీర్పుతో కాకుండా విధ్వంస శక్తుల ద్వారా అధికారంలోకి వచ్చిందని ఆయన మండిపడ్డారు. ఇప్పటికీ తనకు బెదిరింపు సందేశాలు వస్తున్నాయని అన్నారు.
నిరసనకారులు తన నివాసాన్ని ధ్వంసం చేయడంతో ప్రస్తుతం గుండు ప్రాంతంలోని అద్దె ఇంటిలో నివాసం ఉంటున్నట్లు తెలిపారు. నేపాలీ కాంగ్రెస్ అధ్యక్షుడు సహా పలువురి పాస్‌పోర్టులను నిలిపివేయాలని తన నేతృత్వంలోని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు వస్తున్న వార్తలు అవాస్తవాలని ఆయన స్పష్టం చేశారు.