US Snow Storm: అమెరికాను ముంచెత్తిన భారీ మంచు తుఫాను

14 కోట్ల మందిపై ప్రభావం.. పలు రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ

Update: 2026-01-25 02:30 GMT

అమెరికాను ఓ భారీ మంచు తుఫాను (మాన్‌స్టర్ స్టార్మ్) అతలాకుతలం చేస్తోంది. దేశంలోని నైరుతి ప్రాంతంలోని న్యూ మెక్సికో నుంచి ఈశాన్యంలోని న్యూ ఇంగ్లాండ్ వరకు సుమారు 14 కోట్ల మంది ప్రజలపై ఈ తుఫాను ప్రభావం చూపుతోంది. దేశ జనాభాలో ఇది 40 శాతానికి పైగా కావడం గమనార్హం. శనివారం నుంచి సోమవారం వరకు భారీ హిమపాతం, మంచుతో కూడిన వర్షాలు కురుస్తాయని జాతీయ వాతావరణ సేవల విభాగం (NWS) హెచ్చరించింది. ప్రజలందరూ ఇళ్లకే పరిమితం కావాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు సూచించారు.

పలు రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ ప్ర‌క‌ట‌న‌

ఈ విపత్కర పరిస్థితుల నేపథ్యంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డజనుకు పైగా రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు. ఫెడరల్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ (FEMA) సహాయక బృందాలను, నిత్యావసరాలను సిద్ధం చేసిందని హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టి నోయమ్ తెలిపారు. న్యూజెర్సీ గవర్నర్ మైకీ షెరిల్ మాట్లాడుతూ.. "గత కొన్నేళ్లుగా చూడని తీవ్రమైన తుపాను ఇది. ప్రజలు ఇళ్లలోనే ఉండటం మంచిది" అని అన్నారు. తుపాను కారణంగా దేశవ్యాప్తంగా శని, ఆదివారాల్లో కలిపి దాదాపు 13,000 విమాన సర్వీసులు రద్దయినట్లు ఫ్లైట్ అవేర్ వెబ్‌సైట్ వెల్లడించింది. డల్లాస్-ఫోర్ట్ వర్త్, చికాగో, అట్లాంటా, షార్లెట్ వంటి ప్రధాన విమానాశ్రయాల్లో కార్యకలాపాలు నిలిచిపోయాయి.

లక్షలాది ఇళ్లకు నిలిచిపోయిన విద్యుత్ సరఫరా

ముఖ్యంగా మంచు గడ్డకట్టడం (ఐస్) వల్ల నష్టం తీవ్రంగా ఉంది. టెక్సాస్, లూసియానా రాష్ట్రాల్లో సుమారు 1.20 లక్షల ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. టెక్సాస్‌లోని షెల్బీ కౌంటీలో చెట్ల కొమ్మలు విరిగి విద్యుత్ తీగలపై పడటంతో సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రహదారులపై వందలాది చెట్లు కూలిపోయాయని, వాటిని తొలగించే పనులు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. జార్జియాలో గత దశాబ్దకాలంలోనే అత్యంత తీవ్రమైన ఐస్ తుఫాను ఇదే కావొచ్చని, దీని ప్రభావం వల్ల కలిగే నష్టం హరికేన్‌ను తలపించవచ్చని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.

వాతావరణ నిపుణురాలు అల్లిసన్ శాంటోరెల్లి మాట్లాడుతూ.. "ఈ మంచు, ఐస్ కరగడానికి చాలా సమయం పడుతుంది. దీనివల్ల సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుంది" అని వివరించారు. మరోవైపు మిడ్‌వెస్ట్ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు మైనస్ 40 డిగ్రీలకు పడిపోయాయి. విస్కాన్సిన్‌లో గత 30 ఏళ్లలో ఎన్నడూ లేనంత తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఫిలడెల్ఫియా, హ్యూస్టన్ వంటి నగరాల్లో పాఠశాలలకు, పలు యూనివర్సిటీలకు సోమవారం సెలవులు ప్రకటించారు.

Tags:    

Similar News