Afghanistan Floodsల్ అఫ్గాన్‌లో భారీ వరదలు… 350 మంది మృతి
వెయ్యికి పైగా ఇళ్లు ధ్వంసం;
అఫ్గానిస్థాన్‌లో వరదలకు మృతిచెందిన వారి సంఖ్య 300 దాటింది. ఆకస్మిక వరదలకు వెయ్యికిపైగా ఇళ్లు దెబ్బతిన్నట్లు.... ఐక్యరాజ్యసమితి ఫుడ్ ఎజెన్సీ తెలిపింది. అసాధారణ వర్షపాతం కారణంగా.. ఆకస్మిక వరదలు పోటెత్తినట్లు అధికారులు తెలిపారు. వరద బాధిత ప్రజలకు తాము బిస్కెట్లు అందించామని U.N. ఆహార సంస్థ వెల్లడించింది. వరదలకు వందల మంది ప్రజలు చనిపోయారని.. భారీ సంఖ్యలో గాయపడినట్లు తాలిబన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ప్రాణనష్టంతో పాటు విద్యుత్ లైన్లు, రోడ్లు దెబ్బతిన్నాయని ఇంటర్నేషనల్ రిస్క్యూ కమిటీ అఫ్గానిస్థాన్ డైరెక్టర్ సల్మాన్ బెన్ తెలిపారు. వరద బాధిత ప్రాంతాల్లో.. సహాయ చర్యలు ముమ్మరం చేసినట్లు వివరించారు. వరద నీరు తగ్గడంతో అఫ్గన్ పౌరులు తమ ఇళ్లను శుభ్రం చేసుకునే పనుల్లో నిమగ్నమయ్యారు.
ఉత్తర అఫ్గానిస్థాన్‌పై వరదలు తీవ్ర ప్రభావాన్ని చూపించాయి. బగ్లాన్ ప్రావిన్స్‌లో భారీ వరదల కారణంగా శుక్రవారం నాటికి 50 మంది ప్రాణాలు కోల్పోయారని తాలిబన్ల అధికారి ఒకరు తెలిపారు. అలాగే బగ్లాన్ ప్రావిన్స్‌కు పొరుగున ఉన్న తఖర్ ప్రావిన్స్‌లో వరదల ధాటికి 20మంది మరణించారని పేర్కొన్నారు. 'భారీ వరదల కారణంగా బదాక్షన్, బగ్లాన్, ఘోర్, హెరాత్ ప్రావిన్సులు దారుణంగా దెబ్బతిన్నాయి. ఈ విధ్వంసం భారీ ఆస్తి నష్టాన్ని మిగిల్చింది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. క్షతగాత్రుల్ని ఆసుపత్రులకు తరలిస్తున్నాం. బాధితులను రక్షించడం, క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించడానికి, వరదల ధాటికి మరణించినవారి మృతదేహాలను వెలికితీసేందుకు అందుబాటులో ఉన్న అన్ని వనరులను ఉపయోగించుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది' అని వెల్లడించారు.
అఫ్గాన్ వైమానిక దళం బాగ్లాన్‌లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న ప్రజలను ఖాళీ చేయించడం ప్రారంభించిందని తాలిబన్ రక్షణ మంత్రిత్వ శాఖ శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. అఫ్గాన్ వైమానిక దళం వరదల్లో చిక్కుకున్న ప్రజలను రక్షించిందని, వందలాది క్షతగాత్రులను సైనిక ఆస్పత్రులకు తరలించిందని పేర్కొంది. అఫ్గానిస్థాన్ వాతావరణ పరిస్థితులు కూడా ఈ వరదలకు కారణం అవుతున్నాయి. పొడి వాతావరణం కారణంగా అఫ్గానిస్థాన్ నేలలకు నీటిని పీల్చుకునే సామర్థ్యం తక్కువగా ఉంటుంది. కొన్నేళ్ల పాటు అంతర్యుద్ధ పరిస్థితుల్లో మగ్గిన అఫ్గాన్‌కి ప్రకృతి విపత్తుల వల్ల ఎదురయ్యే పర్యావసానాలను తట్టుకునే సన్నద్ధత చాలా తక్కువ. ఈ మధ్య కాలంలో అఫ్గాన్ లో వరుసగా ప్రకృతి విపత్తులు సంభవిస్తుండటం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గత నెలలోనూ(ఏప్రిల్ లో) వరదలు సంభవించి దాదాపు 70 మంది ప్రాణాలు విడిచారు. అలాగే దాదాపు 2,000 ఇళ్లు, మూడు మసీదులు, నాలుగు పాఠశాలలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి.