Asim Munir: మరోసారి అమెరికాకు పాక్ ఆర్మీ చీఫ్..

2 నెలల్లో రెండోసారి యూఎస్ టూర్!;

Update: 2025-08-07 04:45 GMT

పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ మరోసారి అగ్ర రాజ్యం అమెరికాకు వెళ్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రెండు నెలల కాలంలో రెండో పర్యటనకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. సుంకాల విషయంలో భారత్-అమెరికా మధ్య కొంత గ్యాప్ వచ్చింది. భారత్‌కు భారీగా సుంకాలు విధించగా.. పాకిస్థాన్‌కు మాత్రం స్వల్పంగా సుంకాలు విధించింది. దీంతో వాషింగ్టన్‌తో మరింత సంబంధాలు బలపరుచుకునేందుకు దాయాది దేశం పాక్ సిద్ధపడినట్లు సమాచారం. ఇందులో భాగంగా అసిమ్ మునీర్ మరోసారి అమెరికాకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పాకిస్థాన్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.

రష్యా ముడి చమురును దిగుమతి చేసుకోవడంతో భారత్‌పై ట్రంప్ 50 శాతం సుంకం విధించారు. తొలుత 25 శాతం పెంచగా.. జరిమానాగా మరో 25 శాతం పెంచారు. దీంతో భారత ఎగుమతులపై 50 శాతం సుంకాన్ని ప్రకటించారు. రష్యా చమురు కొనుగోలు చేసే ఏ ఇతర దేశానికైనా ఇలాంటి పరిస్థితే ఉంటుందని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. అయితే ఈ చర్యను భారత్ ఖండించింది. అన్యాయం.. అన్యాయం.. అసమంజసమైందిగా విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది.

భారత్-అమెరికా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో దీన్ని క్యాష్ చేసుకోవాలని పాకిస్థాన్ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే అసిమ్ మునీర్ మరోసారి అమెరికా వెళ్లేందుకు సిద్ధపడుతున్నారు. గత జూన్‌లో అసిమ్ మునీర్‌కు వైట్‌హౌస్‌లో గౌరవ మర్యాదలు లభించాయి. ట్రంప్ ప్రత్యేక విందు ఇచ్చారు. ఆ సమయంలోనే మరోసారి అమెరికాకు వస్తానని అప్పుడే మునీర్ చెప్పినట్లుగా పాక్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఇక అమెరికా పర్యటనలో ట్రంప్‌ను శాంతి బహుమతికి అసిమ్ మునీర్ మద్దతు తెలిపారు.

ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడి జరిగింది. అనంతరం పాకిస్థాన్‌పై భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. అనంతరం కాల్పుల విరమణకు తానే కారణం అంటూ ట్రంప్ ప్రకటించారు. అయితే ఈ ప్రకటనను భారత్ ఖండించింది. కాల్పుల విరమణకు మూడో వ్యక్తి ప్రమేయం లేదని.. ఇరు దేశాల చర్చల తర్వాతే కాల్పుల విరమణ జరిగిందని ఇటీవల పార్లమెంట్‌లో మోడీ ప్రకటించారు. మొత్తానికి అమెరికాతో ప్రస్తుతం భారత్‌‌కు గ్యాప్ పెరిగింది.

Tags:    

Similar News