Pakistan Election Results: ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు హవా..
సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు నవాజ్ షరీఫ్ అడుగులు;
పొరుగుదేశం పాకిస్థాన్ సార్వత్రిక ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వెలువడ్డాయి. వివిధ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటూ జైలులో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. బలపరిచిన స్వతంత్ర అభ్యర్థులు అత్యధిక స్థానాల్లో విజయం సాధించారు. ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలోని పాకిస్థాన్ తెహ్రీకే ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీకి చెందిన స్వతంత్ర అభ్యర్థులు 98 చోట్ల సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది. 69 సీట్లతో నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాకిస్థాన్ ముస్లిం లీగ్ (నవాజ్)- పీఎంఎల్-ఎన్ రెండో స్థానంలో, 51 సీట్లతో బిలావల్ భుట్టో జర్దారీ నాయకత్వంలోని పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ నిలిచింది.
తాజా వివరాల ప్రకారం.. మొత్తం 336 సీట్లున్న పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీలో 266 మంది ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు. మిగతా 70 స్థానాలను మైనారిటీలు, మహిళలను నామినేట్ చేసి భర్తీ చేస్తారు. ప్రస్తుతం ఒక స్థానంలో అభ్యర్థి మరణించడంతో 265 స్థానాలకు పోలింగ్ జరిగింది. పీఐటీ పార్టీ నేత ఇమ్రాన్ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో నిలిచిన 91 మంది ఇప్పటి వరకు విజయం సాధించారు. పీఎంఎల్ఎన్ పార్టీ అభ్యర్థులు 71 మంది, పీపీపీ అభ్యర్థులు 53 మంది, ఇతరులు33 మంది విజయం సాధించారు. దీంతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు నవాజ్ షరీఫ్ ప్రయత్నాలు చేస్తున్నారు. హత్యకు గురైన మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో కుమారుడు బిలావల్ భుట్టో – జర్దారీకి చెందిన పీపీపీని సంకీర్ణ భాగస్వామిగా సంప్రదిస్తానని షరీఫ్ చెప్పారు.
ఇమ్రాన్ ఖాన్‌ను ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించి, పీటీఐ ఎన్నికల గుర్తు బ్యాట్‌ను పాక్ ఎన్నికల సంఘం రద్దుచేసింది. దీంతో పీటీఐ తరఫున నేరుగా అభ్యర్థులు పోటీచేయకుండా స్వతంత్రులుగా నామినేషన్ వేసి ఎన్నికల్లో నిలిచారు. అయితే, యువ ఓటర్లు ఇమ్రాన్ బలపరిచిన అభ్యర్థులకు మద్దతుగా నిలిచారు. జైల్లో ఉండటం వల్ల ప్రత్యక్షంగా ఇమ్రాన్ ప్రచారం నిర్వహించలేకపోయారు. సామాజిక మాధ్యమాలు, ఏఐ వంటి సాంకేతికత సాయంతో ప్రచారం నిర్వహించారు. కానీ, ఈ ప్రయత్నాలకు కూడా ఆటంకం కలిగించారు.
పీటీఐ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ జైలు నుంచి సందేశాన్నిఆడియో విజువల్ రూపంలో అందించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఖాన్ మాట్లాడుతూ.. ఎన్నికల్లో విజయం సాధించిన అతని మద్దతుదారులను అభినందించారు. నాతోటి పాకిస్థానీలు.. మీరు చరిత్ర సృష్టించారు. నేను మీ గురించి గర్వపడుతున్నాను. దేశాన్ని ఏకంచేసినందుకు నేను దువునికి కృతజ్ఞతలు తెలపుతున్నాను అని అన్నారు.