Khawaja Asif : మరో 36గంటల్లో దాడిచేయొచ్చంటూ పాక్ మంత్రి ఆందోళన
| విశ్వసనీయ నిఘా సమాచారం ఉందట..;
ఒక పక్క భారత్ ఎప్పుడు సైనిక దాడికి దిగుతుందోనని భయంతో వణుకుతూనే మరో పక్క అలా చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని పాకిస్థాన్ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నది. ‘మాకు అందిన విశ్వసనీయ సమాచారం ప్రకారం భారత్ రానున్న 24-36 గంటల్లో సైనిక చర్యకి దిగుతుంది. అదే కనుక జరిగితే న్యూఢిల్లీ తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదు’ అని బుధవారం పాకిస్థాన్ ఒక ప్రకటనలో హెచ్చరించింది.
దాడి చేసే విధానం, సమయం, లక్ష్యాలను నిర్ణయించే ‘పూర్తి స్వేచ్ఛ’ త్రివిధ దళాలకు ఇస్తూ ప్రధాని మోదీ మంగళవారం ఆదేశాలు ఇచ్చిన క్రమంలో పాకిస్థాన్ ఈ ప్రకటన చేసింది. భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు చాలా దేశాలు ప్రయత్నిస్తున్నప్పటికీ, సమయం గడుస్తున్నకొద్దీ యుద్ధం వచ్చే అవకాశాలు పెరుగుతున్నాయి కానీ తగ్గడం లేదని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా అసిఫ్ చెప్పారు. పార్లమెంటు వెలుపల బుధవారం ఆయనను విలేకర్ల ప్రశ్నించిపుడు ఆయన ఈ విధంగా స్పందించారు. భారత దేశం ఉల్లంఘనకు పాల్పడితే, తాము దీటుగా ప్రతిస్పందిస్తామని చెప్పారు. భారత్ చర్యను బట్టి తమ స్పందన ఉంటుందని, భారత్ చర్య కన్నా భారీగా ఉంటుందని అన్నారు. పాకిస్థాన్ స్పందన గురించి ఎటువంటి సందేహం అక్కర్లేదన్నారు. భారత్ వివేకంతో వ్యవహరిస్తుందని పేర్కొన్నారు.