Shehbaz Sharif: పాక్ ప్రధాని పదవికి నేడు రాజీనామా
జాతీయ అసెంబ్లీని రద్దు చేసే అవకాశం;
పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ రాజీనామా చేయనున్నారు.ఈ ఏడాది చివరల్లో పాకిస్థాన్‌లో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు అదనపు సమయం పొందేందుకు జాతీయ అసెంబ్లీని రద్దు చేయాలని కోరుతూ ఆ దేశ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ బుధవారం పాక్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీకి లేఖ రాయనున్నారు. నిర్ణీత కాలానికి మూడు రోజుల ముందుగానే అసెంబ్లీలను రద్దు చేస్తామని, ఆ తర్వాత 90 రోజుల్లో ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం ప్రకటించింది.
పాకిస్తాన్ పార్లమెంటు దిగువసభ పదవీకాలం మరో మూడు రోజుల్లో అంటే ఈ నెల 12న ముగుస్తుంది. ఈ నేపథ్యంలో నేడే దానిని రద్దు చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఈ విషయాన్ని అధ్యక్షుడు అరిఫ్ అల్వీకి షేబాజ్ సమాచారం పంపనున్నారు. ఆయన కనుక ఈ విషయంలో నిర్ణయం తీసుకోని పక్షంలో అసెంబ్లీ 48 గంటల్లో రద్దు అవుతుంది.
ప్రధాని పదవి నుంచి తప్పుకోనున్న షరీఫ్ నిన్న రావల్పిండిలోని ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌ను సందర్శించారు. అక్కడాయనకు ఘన స్వాగతమే కాదు వీడ్కోలు కూడా లభించింది. ఒకవేళ షేబాజ్ నేడు రాజీనామా చేసినా ఆయన సారథ్యంలోని ముస్లిం లీగ్ నవాజ్ సంకీర్ణ ప్రభుత్వం మరో రెండు రోజులు అంటే 11వ తేదీ వరకు అధికారంలో ఉండే అవకాశం ఉంది.
మరోవైపు కోర్టు తీర్పును సవాలు చేసే క్రమంలో ఇమ్రాన్ ఖాన్‌ను కలిసేందుకు ఆయన తరపు న్యాయవాది నయీమ్ హైదర్ పంతోజీ జైలుకి వెళ్లారు. ఈ నేపథ్యంలో ఇమ్రాన్‌తో ఆయన దాదాపు గంట పాటు మాట్లాడారు. తనకు జైల్లో కల్పిస్తున్న సదుపాయాలు చాలా దారుణంగా ఉన్నాయని ఇమ్రాన్ చెప్పినట్లు న్యాయవాది మీడియాకు వెల్లడించారు. తనను ఓపన్ వాష్‌రూం ఉన్న ఓ చిన్న చీకటి గదిలో ఉంచారని, టీవీ, వార్తాపత్రిక కూడా లేకుండా ఈగలు, చీమలతో తను సహవాసం చేస్తున్నానని, తనని ఉగ్రవాదిగా చూస్తున్నారని అయినప్పటికీ.. జీవితమంతా జైలులో గడపడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఇమ్రాన్ చెప్పారని ఆయన తరఫున న్యాయవాది తెలిపారు.