Pakistan Polls : పాకిస్థాన్ ఎన్నికల్లో రిగ్గింగ్ నిజమే
ఎన్నికల అధికారి రాజీనామా;
ఇటీవల జరిగిన పాక్ ఎన్నికల్లో పోల్ రిగ్గింగ్ జరిగిందని ఇందులో పాక్ ఎన్నికల కమిషనర్, చీఫ్ జస్టీస్‌ల ప్రమేయం ఉనట్లు రావల్పిండి మాజీ కమిషనర్ లిఖ్వత్ అలీ ఛత్తా ఆరోపించారు. దీనికి బాధ్యత వహిస్తూ తాను రాజీనామా చేశారు. ఫిబ్రవరి 8 జరిగిన ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగినట్లు జైల్లో ఉన్న ఇమ్రాన్ ఖాన్ పార్టీ తెహ్రీక్ ఏ ఇన్ఫాఫ్ పార్టీ నేతలు దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు పాక్‌లో దుమారం లేపుతున్నాయి.
పాకిస్థాన్ ఎన్నికల్లో తప్పులు చేసినట్లు ఒప్పుకున్న ఒక ఎన్నికల అధికారి రాజీనామా చేశారు. పోల్ రిగ్గింగ్, ఫలితాల మార్పులో ఆ దేశ ప్రధాన ఎన్నికల కమిషనర్, ప్రధాన న్యాయమూర్తికి ప్రమేయం ఉందని ఆరోపించారు. ఈ తప్పులన్నింటికీ బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేసినట్లు సీనియర్ అధికారి, రావల్పిండి ఎన్నికల కమిషనర్ లియాఖత్ అలీ చత్తా తెలిపారు. శనివారం స్థానిక క్రికెట్ స్టేడియంలో మీడియాతో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో ఓడిన అభ్యర్థులను గెలిపించారని, ఫలితాలను తారుమారు చేశారని ఆయన ఆరోపించారు. కాగా, దేశానికి వెన్నుపోటు పొడిచిన తనకు నిద్ర పట్టలేదని లియాఖత్ అలీ చత్తా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అన్యాయానికి పాల్పడిన తనతోపాటు మరికొందరికి శిక్ష పడాలని అన్నారు. ఆత్మహత్య గురించి ఆలోచించేంత ఒత్తిడి తనపై ఉందని తెలిపారు. అయితే ప్రజలకు అసలు విషయం తెలియజేయాలని తాను నిర్ణయించుకున్నట్లు చెప్పారు. రాజకీయ నాయకుల కోసం ఎలాంటి తప్పులు చేయవద్దని మొత్తం అధికార వర్గానికి తన విన్నపమని అన్నారు.
మరోవైపు ఫిబ్రవరి 8న జరిగిన ఎన్నికల్లో చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌పై లియాఖత్ అలీ చత్తా చేసిన ఆరోపణలను పాకిస్థాన్ ఎన్నికల సంఘం (ఈసీపీ) ఖండించింది. ఎన్నికల ఫలితాలు మార్చాలని ఎన్నికల సంఘంలోని ఏ అధికారి కూడా రావల్పిండి కమిషనర్‌కు ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదని తెలిపింది. అయినప్పటికీ ఈ ఆరోపణలపై దర్యాప్తు చేస్తామని ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీనామా చేయాలని ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పీటీఐ డిమాండ్ చేసింది. ఎన్నికల్లో రిగ్గింగ్, ఫలితాల తారుమారుపై పాకిస్థాన్ వ్యాప్తంగా ఆ పార్టీ నిరసనలు చేపట్టింది.