Pakistan Debt Crisis: పాకిస్థాన్‌ను అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్న షాబాజ్..
పేదరికంలో నయా రికార్డు..!
దాయాది దేశం పాకిస్థాన్ అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్నారనే అపవాదును ప్రతీసారి ఎదుర్కుంటున్న పాక్‌లో పూర్తిగా పారిశ్రామిక వృద్ధి నిలిచిపోయింది. విదేశీ మారక ద్రవ్య నిల్వలు పతాక స్థాయికి పడిపోయాయి. దీంతో పాకిస్థాన్ పేదరికంలో కొత్త రికార్డును సృష్టిస్తోంది. షాబాద్ ప్రధాని అయ్యాక ఆ దేశం పరిస్థితి మరింత దిగజారింది. జూన్ 2025 నాటికి పాకిస్థాన్ మొత్తం ప్రజా రుణం US$286.832 బిలియన్లకు (సుమారు 80.6 ట్రిలియన్ పాకిస్థానీ రూపాయలు) పెరిగింది. ఇది గత సంవత్సరంతో పోలిస్తే దాదాపు 13 శాతం పెరిగిందని అధికారిక డేటా వెల్లడించింది. తాజాగా పాకిస్థాన్ ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన 2025 ఆర్థిక ఏడాది వార్షిక రుణ సమీక్ష ప్రకారం.. జూన్ 2025 చివరి నాటికి, పాకిస్థాన్ మొత్తం ప్రజా అప్పు రూ. 80.6 ట్రిలియన్లకు చేరుకుంది. ఇందులో దేశీయ అప్పు రూ. 54.5 ట్రిలియన్లు, బాహ్య అప్పు రూ. 26.0 ట్రిలియన్లు ఉన్నాయి.
జూన్ 2024లో 68 శాతంతో పోలిస్తే, జూన్ 2025లో రుణం-జీడీపీ నిష్పత్తి దాదాపు 70 శాతానికి పెరిగింది. ఈ పెరుగుదల ప్రధానంగా 2025లో ఊహించిన దానికంటే తక్కువ జీడీపీ వృద్ధి నమోదైందని.. దీని కారణంగా అప్పు పెరిగిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. ద్రవ్యోల్బణం వల్ల ఆర్థిక విస్తరణ మందగించిందని తెలిపింది. దేశీయ అప్పులు గత ఏడాదితో పోలిస్తే 15 శాతం పెరిగి 54.5 ట్రిలియన్ రూపాయలకు చేరుకున్నాయని, ఇది గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో అత్యల్ప వార్షిక పెరుగుదల అని నివేదిక పేర్కొంది. ఇంతలో బాహ్య అప్పులు జూన్ 2025 నాటికి 6 శాతం పెరిగి US$91.8 బిలియన్లకు చేరుకున్నాయి. ఇది ప్రధానంగా IMF నుంచి నిధులు, ఆసియా అభివృద్ధి బ్యాంకు (ADB) హామీ ఇచ్చిన $1 బిలియన్ వాణిజ్య రుణం, ఇతర బహుపాక్షిక సంస్థల నుంచి వచ్చే నిధుల కారణంగా జరిగింది.