Pakistan : బక్రీద్ వేళ పాకిస్తాన్ లో గొర్రెలు, మేకల దొంగతనాలు
ఆర్ధిక సంక్షోభం లో పాకిస్తాన్;
పాకిస్తాన్ లో పరిస్థితి ఘోరంగా తయారైయ్యింది. ఈ నెల 29న బక్రీద్ నేపథ్యంలో ఆ దేశంలో గొర్రెల, మేకలకు రక్షణ కరువైంది. బక్రీద్ సమయంలో జంతువులను బలి ఇవ్వడం ఆచారం. అయితే మేకలు, గొర్రెల ధరలు ఆకాశాన్నంటుతుండడంతో చాలామంది దొంగతనాలకు పాల్పడుతున్నారు. పాకిస్థాన్ ఆర్థిక రాజధాని కరాచీలో మేకలు, గొర్రెలు, పశువుల దొంగతానికి గురయ్యాయంటూ గత కొంతకాలంగా కంప్లైంట్ లు వస్తున్న్నట్టుగా సమాచారం.
అమ్మకాలకోసం పశులను తీసుకు వెళుతున్న వారిని బెదిరించి, జీవాలను అపహరిస్తున్నారంటూ ఇక్కడి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్నిరోజుల కిందట లారీలో మేకలు తీసుకువెళుతుండగా, ఇద్దరు వ్యక్తులు బైక్ పై వచ్చి లారీడ్రైవర్ ను తుపాకీతో బెదిరించి మేకలను తీసుకెళ్లారు. ఖరీదైన కార్ లలో వచ్చి గొర్రెలు ఎత్తుకుపోతున్నారని, కాస్త దూరం వెళ్లి అక్కడ అమ్మేసి వెళ్లిపోతున్నారన్న ఆరోపణలతో పోలీస్ స్టేషన్లు మారు మ్రోగిపోతున్నాయి. పాకిస్థాన్ లో సాధారణ దొంగతనాలే అత్యధిక సంఖ్యలో నమోదవుతున్నాయనుకుంటే, ఇప్పుడు బక్రీద్ సీజన్ లో మేకలు, గొర్రెలను చోరీ చేస్తున్న ఘటనలు అంతకంటే ఎక్కువగా నమోదవుతున్నాయట. దాంతో కరాచీ నగరంలో ఇలాంటి ఘటనలకు అడ్డుకట్ట వేసేందుకు షాహీన్స్ పేరిట ప్రత్యేక పోలీసు దళాలను ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం.
పాకిస్తాన్ లో ప్రస్తుతం ఆర్థిక, రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ప్రజలకు నిత్యావసరాలే కరువయ్యాయి. కొందాం అనుకున్న దొరకని పరిస్థితి ఉంది. ప్రజలకు పనులు లేక ఆదాయం తగ్గింది. ఈ నేపథ్యంలో పలువురు చోరీలకు పాల్పడుతున్నారని నిపుణులు చెబుతున్నారు. ఇస్లాం మత విశ్వాసాల ప్రకారం త్యాగానికి ప్రతీకగా భావించి ముస్లింలందరూ ‘ఈద్ ఉల్ అద్హా’ అనే పండుగను బక్రీద్ పేరిట జరుపుకుంటారు. రంజాన్ తర్వాత ముస్లింలు జరుపుకునే అతి పెద్ద పండుగ ఇదే. బక్రీద్ అంటే బకర్ ఈద్ అని అర్థం. బకర్ అంటే మూగజీవి.. ఈద్ అంటే పండుగ అని అర్థం. ఇస్లాం క్యాలెండర్ ప్రకారం జిల్హిజా మాసంలో పదో రోజున బక్రీద్ పండుగను జరుపుకుంటారు. ఈ కాలంలో ముస్లింలు హజ్ యాత్ర చేయాలని కోరుకుంటారు. ఇదే సమయంలో ఖుర్బానీ ఇస్తారు కాబట్టి దీన్ని ఈదుల్ ఖుర్బానీ అని కూడా పిలుస్తారు.
ఈ సమయంలో తమ ప్రియమైన వస్తువులను త్యాగం చేయమని దేవుడు చెప్పగా , ప్రవక్త తన కుమారుడు ఇస్మాయిల్‌ను త్యాగం చేసేందుకు సిద్ధపడతాడు. ఆయన త్యాగానికి మెచ్చిన అల్లాహ్ ప్రాణ త్యాగానికి బదులు ఓ మూగ జీవాన్ని బలి ఇవ్వాలని చెబుతాడు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం బక్రీద్ పండుగ రోజున ఖుర్బానీ ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. అలా బలి ఇచ్చిన మూగజీవాలను మూడు భాగాలుగా చేసి.. అందులో ఓ వంతు పేద ప్రజలకు, రెండో వంతు తమ చుట్టాలకు, మూడో వంతు భాగాన్ని తమ కుటుంబం కోసం వాడుకుంటారు.