Pakistan : పాకిస్తాన్ లో ఉగ్రదాడి
చైనాకు ఇంజినీర్ల కాన్వాయ్‌పై విరుచుకుపడ్డ టెర్రరిస్టులు;
పాకిస్తాన్‌లో భారీ ఉగ్రదాడి జరిగింది. చైనాకు చెందిన ఇంజినీర్ల కాన్వాయ్‌పై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ మెరుపుదాడిలో పలువురు ఇంజినీర్లు, సెక్యూరిటీ సిబ్బంది గాయపడ్డారు. అయితే భద్రత బలగాలు జరిపిన ఎదురు కాల్పుల్లో ఇప్పటివరకు ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు.
పాకిస్థాన్‌లో చైనా ఇంజినీర్లు ప్రయాణిస్తోన్న వాహనాలపై బలూచ్ వేర్పాటువాదుల దాడికి దిగారు. 23 మంది చైనా ఇంజినీర్లు, ఏడు వాహనాల్లో గ్వాదర్ పోర్టుకు వెళ్తుండగా బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) వేర్పాటువాదులు గ్రనేడ్లు విసిరి, తుపాకులతో కాల్పులు జరిపారు. అయితే వారు ప్రయాణిస్తున్న వాహనాలు బుల్లెట్ ప్రూఫ్ కావడంతో చైనా ఇంజినీర్లు చిన్న గాయాలతో బయటపడ్డారు. స్థానికంగా ఉన్న ఫకీర్ కాలనీ వంతెనపైకి కాన్వాయ్ చేరుకోగానే రెబల్స్ కాల్పులు జరిపారు. దాదాపు రెండు గంటల పాటు తీవ్రవాదులు, సైన్యం మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఒక చైనా ఇంజినీరు.. భద్రతా సిబ్బంది ఒకరు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.
ఈ దాడికి బాధ్యత వహిస్తూ బలూచ్ లిబరేషన్ ఆర్మీకి చెందిన మజీద్ బ్రిగేడ్ ప్రకటన విడుదల చేసింది.అయితే సైన్యం దాడికి పాల్పడిన ఇద్దరు ముష్కరులను మట్టుబెట్టింది. పాక్ స్వాతంత్ర్య దినోత్సవానికి ఒక్క రోజు ముందు ఈ దాడి జరిగింది. తాజా దాడులతో గ్వాదర్ పోర్టుకు వెళ్లే అన్ని మార్గాలను అధికారులు మూసివేశారు. ఘటనతో అప్రమత్తం అయిన పాక్‌లోని చైనా రాయబార కార్యాలయం బలూచిస్థాన్, సింధ్ ప్రావిన్సుల్లోని చైనా పౌరులు తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఇళ్లలోనే ఉండాలని హెచ్చరించింది.
తరువాత పరిస్థితి అదుపులో ఉందని సైనిక పాకిస్థాన్ అధికారిక రేడియా ప్రకటన చేసింది. భద్రతా బలగాల ఎదురు కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడని, ముగ్గురు గాయపడ్డారని తెలిపింది. అయితే పాక్‌లోని చైనా పౌరులు లక్ష్యంగా దాడులు జరగడం ఇదే మొదటిసారి కాదు. గ్వాదర్ పోర్టుపై చైనా పెత్తనాన్ని సహించలేక ఇలాంటి దాడులు గత కొంత కాలంగా జరుగుతూనే ఉన్నాయి. గతేడాది మేలో ఓ మహిళ కరాచీలోని విశ్వవిద్యాలయం సమీపంలో చైనీయులు ప్రయాణిస్తున్న బస్సుపై ఆత్మాహుతి దాడికి పాల్పడింది. ఈ దాడి వెనుక బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ హస్తం ఉందని వెల్లడయ్యింది.
రెండేళ్ల కిందట కూడా అచ్చం ఇలాగే చైనా ఇంజినీర్లతో వెళ్తోన్న బస్సుపై ఉగ్రదాడి జరిగి 13 మంది మృతి చెందారు.అయితే పాకిస్తాన్- చైనా మధ్య సన్నిహిత సంబంధాలు మాత్రం కొనసాగుతున్నాయన్న విషయం తెలిసిందే. నిజానికి పాకిస్తాన్‌లో భారీగా పెట్టుబడులను పెట్టింది చైనా. ఈ రెండు దేశాలు కలిసి చైనా-పాకిస్తాన్ ఆర్థిక కారిడార్‌ను నిర్మిస్తున్నాయి. దీనికోసం డ్రాగన్ కంట్రీ పెట్టిన పెట్టుబడి విలువ 60 మిలియన్ డాలర్లు. ప్రస్తుతం ఈ ఎకనమిక్ కారిడార్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. చైనాకు చెందిన ఇంజినీర్లు ఈ నిర్మాణ పనుల్లో చురుగ్గా పాల్గొంటోన్నారు.