Poland: పోలాండ్‌లో ఎయిర్‌షో రిహార్సల్స్‌లో ఘోర ప్రమాదం
కుప్పకూలిన ఎఫ్-16 విమానం..
పోలాండ్‌లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. సెంట్రల్ పోలాండ్‌లోని రాడోమ్ నగరంలో ఎయిర్‌షో కోసం నిర్వహిస్తున్న రిహార్సల్స్‌లో భాగంగా పోలిష్ వైమానిక దళానికి చెందిన ఎఫ్-16 యుద్ధ విమానం నిన్న కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో విమానాన్ని నడుపుతున్న పైలట్ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ విషయాన్ని దేశ ఉప ప్రధాన మంత్రి వ్లాడిస్లావ్ కొసినియాక్-కామిస్జ్ అధికారికంగా ధ్రువీకరించారు.
ప్రమాదానికి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గాల్లో బ్యారెల్-రోల్ విన్యాసం చేసేందుకు ప్రయత్నించిన ఫైటర్ జెట్ అదుపుతప్పి వేగంగా నేలవైపు దూసుకొచ్చింది. రన్‌వేపై కుప్పకూలిన వెంటనే భారీ అగ్నిగోళంగా మారి మంటల్లో చిక్కుకుంది. మంటలతోనే విమానం కొన్ని మీటర్ల దూరం దూసుకెళ్లిన దృశ్యాలు అందులో రికార్డయ్యాయి.
ఈ ఘటనపై ఉప ప్రధాని వ్లాడిస్లావ్ ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. పైలట్ మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. “ఎఫ్-16 విమాన ప్రమాదంలో పోలిష్ ఆర్మీ పైలట్ మరణించారు. ఆయన గొప్ప ధైర్యసాహసాలు, అంకితభావంతో మాతృభూమికి సేవ చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. వారి కుటుంబ సభ్యులకు, ఆప్తులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను” అని ఆయన పేర్కొన్నారు.