PM Modi: నేటినుంచి 8 రోజులు 5 దేశాల్లో మోడీ పర్యటన
ఘనా, ట్రినిడాడ్ మరియు టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియాలో టూర్;
ప్రధాని మోడీ ఒకేసారి ఐదు విదేశీ పర్యటనలకు వెళ్తున్నారు. మంగళవారం నుంచి 8 రోజుల పాటు ఐదు దేశాల్లో పర్యటించనున్నారు. ఘనా, ట్రినిడాడ్ మరియు టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియాల్లో ప్రధాని పర్యటించనున్నారు. జూలై 2-9 తేదీల్లో ఈ పర్యటన కొనసాగనుంది. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరగనున్నాయి. అలాగే రక్షణ, అరుదైన భూమి ఖనిజాలు, ఉగ్రవాద నిరోధక సహకారంపై చర్చలు ఉండనున్నాయి. ఇక బ్రెజిల్‌లో జరిగే బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో మోడీ పాల్గొననున్నారు.
తొలుత జూలై 2, 3 తేదీల్లో ఘనాలో పర్యటించనున్నారు. ఘనా అధ్యక్షుడితో ప్రధాని ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. అలాగే ఆర్థిక, ఇంధన, రక్షణ సహకారంపై కూడా చర్చించే అవకాశాలు ఉన్నాయి. జులై 9 వరకు కొనసాగే పర్యటనలో రెండు ఖండాల్లో టూర్ సాగనుంది. ఒకేసారి మోడీ ఇన్ని దేశాల్లో పర్యటించడం ఇది మూడోసారి. 2016లో అమెరికా, మెక్సికో, స్విట్జర్లాండ్, ఆఫ్గానిస్థాన్, ఖతార్‌లో పర్యటించారు. అలాగే 2015 జులైలో ఎనిమిది రోజుల పాటు ఆరు దేశాల్లో పర్యటించారు. రష్యాతో పాటు మధ్య ఆసియా దేశాల్లో టూర్ కొనసాగింది.
జూలై 2, 3 తేదీల్లో ఘనాలో పర్యటించనున్నారు. 3 దశాబ్దాల తర్వాత భారత ప్రధాని ఘనాలో పర్యటించడం ఇదే తొలిసారి. అనంతరం జులై 3, 4 తేదీల్లో ట్రినిడాడ్ మరియు టొబాగోలో పర్యటించనున్నారు. ఇక జులై 4న అర్జెంటీనాకు వెళ్లనున్నారు. 5వ తేదీ వరకు అక్కడే ఉండనున్నారు. జూలై 5-8 వరకు బ్రెజిల్‌లో పర్యటిస్తారు. బ్రెజిల్‌లోని రియో వేదికగా జరగనున్న 17వ బ్రిక్స్ సదస్సులో పాల్గొని అభిప్రాయాలను పంచుకోనున్నారు. చివరిగా 9న నమీబియాకు వెళ్లి.. ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. నమీబియా పార్లమెంటులోనూ ప్రసంగించే అవకాశం ఉన్నట్లు సమాచారం.