POK: పాకిస్థాన్‌పై పీవోకే ప్రజల ఆగ్రహం
ప్రజల కనీస అవసరాలు పట్టించుకోవటం లేదంటూ ఆందోళన;
పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లో పాకిస్థాన్ ప్రభుత్వంపై వ్యతిరేకత అంతకంతకూ పెరుగుతోంది. సమృద్ధిగా ఉన్న వనరులను దోపిడీ చేస్తున్న ప్రభుత్వంతమకు కనీస వసతులు కల్పించటంలో విఫలమైందని ప్రజలు మండిపడుతున్నారు. తీవ్రమైన ఆర్థిక సంక్షోభ పరిస్థితుల్లో సబ్సిడీ గోధుమల రేటు పెంచి భారం మోపటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్-పీవోకే ప్రజల్లో పాకిస్థాన్ ప్రభుత్వంపై రోజురోజుకు వ్యతిరేకత తీవ్రమవుతోంది. ప్రజాందోళనలు నిత్యకృత్యంగా మారాయి. నిర్బంధం విధించినా కూడా ప్రజలు ఏమాత్రం బెదరకుండా నిరసనగళాన్ని గట్టిగానే వినిపిస్తున్నారు. వనరులు సమృద్ధిగా ఉన్నప్పటికీ కూడా తాము చాలా గడ్డు పరిస్థితుల్లో బతకాల్సి వస్తోందని గిల్గిట్-బల్టిస్థాన్ ప్రజలు మండిపడుతున్నారు. తమకు హక్కులే కాదు కనీస సౌకర్యాలు కూడా లేవని ఆక్రోశం వెల్లగక్కుకున్నారు. ఇది చాలదన్నట్టు.... సబ్సిడీ గోధుమల ధరను ప్రభుత్వం పెంచింది. ధర పెంచి కూడా నాసిరకమైన గోధుమలు పంపిణీ చేయటంపై గిల్గిట్ బల్టిస్థాన్ ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు.
75ఏళ్ల నుంచి సమృద్ధిగా నీరు ఉన్నప్పటికీ మాకు విద్యుత్ కానీ సరైన విద్య కానీ ఏదీ ఇవ్వలేదు. చాలా నాసిరకమైన గోధుమలను సరఫరా చేస్తున్నారు. ఆ పిండితో చేసిన చపాతీలు తిన్నవారు ఆస్పత్రిపాలవుతున్నారు. చపాతీలు చేస్తే నల్లగా అవుతున్నాయి. వీటిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లేదా మంత్రి తింటే తెలుస్తుంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గిల్గిట్-బల్టిస్థాన్ ప్రాంతంలోని వనరులను దోపిడీ చేస్తున్న ప్రభుత్వం తమకు కనీస వనరులు కల్పించటంపై దృష్టి సారించటం లేదని అక్కడి ప్రజలు మండిపడున్నారు. పాక్ సర్కార్ అలసత్వం కారణంగా తాము అంధకారంలో మగ్గాల్సి వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొన్నినెలల నుంచి విద్యుత్తు సరఫరా దారుణంగా తయారైందని, అయినా ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్నారు. కరెంటు కోతలకు వ్యతిరేకంగా పెద్దఎత్తున ఆందోళన చేస్తున్నారు. అయినా పాక్ ప్రభుత్వం నుంచి కనీస స్పందన కరవైందని గిల్గిట్ బల్టిస్థాన్ ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. తమకు ఆర్థిక, రాజకీయ హక్కులు కల్పించాలంటూ ఆందోళన గిల్గిట్-బల్టిస్థాన్ ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు. కనీస సౌకర్యాలైన ఉపాధి, విద్యుత్తు, నాణ్యమైన గోధమలు సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నారు