Louvre Museum: ప్రఖ్యాత పారిస్ మ్యూజియంలో భారీ చోరీ
తాత్కాలికంగా మూసివేత
ప్రపంచ ప్రసిద్ధిగాంచిన మోనాలిసాఅసలు చిత్రం ఉన్న ప్రఖ్యాత పారిస్ మ్యూజియంలో భారీ చోరీ జరిగింది. పారిస్‌లోని ప్రఖ్యాత ఆర్ట్ మ్యూజియం లో ఆదివారం తెల్లవారుజామున దోపిడీ జరిగినట్లు ఫ్రాన్స్ మంత్రి రాచిడా దాతి వెల్లడించారు. ఈ ఘటనలో మ్యూజియం సిబ్బంది ఎవరూ గాయపడలేదన్నారు. దీనిపై దర్యాప్తు కొనసాగుతుండడంతో ప్రస్తుతం మ్యూజియాన్ని మూసివేసినట్లు ఆమె పేర్కొన్నారు.
మ్యూజియంలో ఓ వైపు నిర్మాణం జరుగుతుందని..దుండగులు అక్కడి నుంచి మ్యూజియం లోపలికి చొరబడ్డారని స్థానిక మీడియా వర్గాలు పేర్కొన్నాయి. అనంతరం సరుకు రవాణా ఎలివేటర్‌లో అపోలో గ్యాలరీలోకి ప్రవేశించినట్లు తెలిపాయి. నెపోలియన్ కాలంనాటి వస్తువులు, ఆభరణాలు ఉన్న గ్యాలరీ అద్దాలను పగలగొట్టి అందులో నుంచి తొమ్మిది వస్తువులను దొంగలించినట్లు సమాచారం. దీంతో ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.
కాగా గతంలో కూడా అనేకమంది దుండగులు ఆర్ట్ మ్యూజియంలో చోరీకి ప్రయత్నించారు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన మోనాలిసా (Mona Lisa) చిత్రాన్ని 1911లో మ్యూజియంలో పని చేసిన మాజీ కార్మికుడు విన్సెంజో పెరుగ్గియా దొంగలించాడు. రెండేళ్లపాటు దీనిపై విచారణ జరిపిన అధికారులు అనంతరం అతడి నుంచి మోనాలిసా చిత్రాన్ని స్వాధీనం చేసుకున్నారు. 1983లో మ్యూజియం నుంచి రెండు పురాతన కవచాలను దుండగులు దొంగలించారు. దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత అధికారులు వాటిని కనుగొన్నారు. మెసపటోమియా, ఈజిప్టునకు చెందిన అనేక వస్తువులు, వివిధ రాజ్యాలకు సంబంధించిన చిత్రాలు, శిల్పాలు వంటి వాటికి ఈ మ్యూజియం నిలయంగా ఉంది. మోనాలిసా, వీనస్ డి మిలో, వింగ్డ్ విక్టరీ ఆఫ్ సమోత్రేస్, వెర్సైల్లెస్ డయానా వంటి ప్రముఖ ఆకర్షణలు ఇందులో ఉన్నాయి. ఈ మ్యూజియాన్ని రోజుకు దాదాపు 30వేలమంది సందర్శిస్తుంటారు.