Vaccine: ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ల తయారీ ప్రాజెక్టులకు బ్రేక్..
500 మిలియన్ల డాలర్ల నిధుల్ని ఆపేసిన అమెరికా;
ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్లు అభివృద్ధి చేస్తున్న కంపెనీలకు జలక్ ఇచ్చింది అమెరికా సర్కారు. ఆ దేశానికి చెందిన ఆరోగ్య శాఖ తాజాగా వివాదాస్పద నిర్ణయం తీసుకున్నది. ఎంఆర్ఎన్ఏ ప్రాజెక్టుల కోసం కేటాయించిన 500 మిలియన్ల డాలర్ల నిధులను రద్దు చేస్తున్నట్లు హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ శాఖ పేర్కొన్నది. ఆరోగ్యశాఖ మంత్రి రాబర్ట్ ఎఫ్ కెన్నడీ జూనియర్ దీనిపై ప్రకటర చేశారు.
కోవిడ్‌తో పాటు వివిధ రకాల వైరస్‌ల నియంత్రణ కోసం కొన్ని కంపెనీలు ఎంఆర్ఎన్ఏ టీకాలను అభివృద్ధి చేస్తున్నాయి. దానిలో భాగంగా ఫైజర్, మోడెర్నా లాంటి ఫార్మసీ సంస్థలతో గతంలో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్నది. ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్లపై సుమారు 22 ప్రాజెక్టులు ఉన్నాయి. ఆ ప్రాజెక్టులకు ప్రస్తుతం నిధుల్ని నిలిపివేస్తున్నట్లు ఆర్ఎఫ్‌కే జూనియర్ తెలిపారు.
ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ల వల్ల శ్వాసకోస వైరస్‌తో లాభం కన్నా నష్టమే ఎక్కువగా ఉన్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి చెప్పారు. కోవిడ్ సమయంలో జరిగిన ఎంఆర్ఎన్ఏ సంబంధిత పెట్టుబడులపై సమగ్రమైన సమీక్ష చేపట్టిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆరోగ్యశాఖ పేర్కొన్నది. రద్దు చేసిన నిధులను మరింత సురక్షితమైన వ్యాక్సిన్ ఫ్లాట్‌ఫామ్‌లకు తరలించనున్నట్లు కెన్నడీ తెలిపారు.