Putin: ఉక్రెయిన్‌లో శాంతి అప్పుడే కాదు
ఉక్రెయిన్ పై తమ లక్ష్యాలేవి మారలేదన్న పుతిన్;
తమ లక్ష్యాల్ని సాధించేవరకు ఉక్రెయిన్‌లో శాంతి స్థాపనకు చోటులేదని రష్యా అధ్యక్షుడు పుతిన్ స్పష్టం చేశారు. మరికొద్ది రోజుల్లో (2024 మార్చి 17న) రష్యా అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగబోతున్నవేళ చాలా రోజుల తర్వాత ఆయన మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా పలువురు రష్యా పౌరులు, రెండోసారి సైనిక సమీకరణ చేపడతారా? పౌరుల్ని బలవంతంగా యుద్ధ క్షేత్రంలోకి పంపుతారా? అని పుతిన్ ముందు సందేహం వ్యక్తం చేశారు. అయితే.. రష్యాకు ఇప్పుడా అవసరం లేదని పుతిన్ సమాధానమిచ్చారు.
ఉక్రెయిన్ విషయంలో తమ లక్ష్యాలేవి మారలేదని, వాటిని సాధించేవరకు శాంతి స్థాపన ప్రస్తావనే ఉండదని రష్యా అధ్యక్షుడు పుతిన్ స్పష్టం చేశారు. మాస్కో వేదికగా నిర్వహించిన వార్షిక మీడియా సమావేశంలో పుతిన్ మాట్లాడారు. ఉక్రెయిన్ నిస్సైనికీకరణ, నాజీవాదం నిర్మూలన, తటస్థ వైఖరి అవలంబించాలనే లక్షాలతో ఉక్రెయిన్‌పై మాస్కో సైనిక చర్యను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఉక్రెయిన్ తటస్థంగా ఉండాలని, నాటో దేశాలతో మైత్రి సాగించకూడదని ఆయన డిమాండ్ చేశారు. పుతిన్ దాదాపు 24 ఏళ్లుగా అధికారంలో కొనసాగుతున్నారు. ఇప్పుడు ఎన్నికలకు వెళ్తున్నానని పేర్కొన్నారు. సెంట్రల్ మాస్కోలో హాలులో ఆయన ప్రవేశించగానే చప్పట్లతో సభికులు స్వాగతం పలికారు. ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య మొదలై 22 నెలలు కావస్తోంది. ఇరువైపులా భారీ సంఖ్యలో ప్రాణనష్టం సంభవిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన అరుదైన సమాచారాన్ని పంచుకున్నారు. తాము గత ఏడాది చేపట్టిన సైనిక చర్య కోసం 6,17,000 మంది రష్యా సైనికులు ఉక్రెయిన్‌కు వెళ్లారని.. మరింత బలగాల సమీకరణ చేయాల్సిన అవసరం లేదని చెప్పారు. ఇప్పటివరకు 4,86,000 మంది ఒప్పందాలపై సంతకాలు చేసి సైన్యంలో చేరారని పేర్కొన్నారు. ఉక్రెయిన్ (Ukraine) ఎదురుదాడులు చేసినట్లు చెబుతున్నప్పటికీ కూడా ఆ దేశం సాధించింది ఏమి లేదన్నారు.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గురువారం తన చిన్ననాటి కలలు, ఆశయాల గురించి ప్రజలతో పంచుకున్నారు. పైలట్ కావాలని తాను చిన్నప్పుడు కలలుగనేవాడినని, తర్వాత ఇంటెలిజెన్స్ ఆఫీసర్‌ని అవ్వాలనుకున్నానని పుతిన్ వెల్లడించారు. వ్యక్తుల వయస్సు, చుట్టుపక్కల పరిసరాలు, మనుషుల ప్రభావం వల్ల ప్రాధాన్యతలు కూడా మారుతూ ఉంటాయని, అలాగే తన తన ఇష్టాయిష్టాలు కూడా మారాయని ఆయన చెప్పారు. అయితే ఇంటెలిజెన్స్ అధికారి కావాలన్న తన కల నెరవేర్చుకున్నట్టు ఆయన తెలిపారు. రష్యా అధ్యక్షుడు కాకముందు కేజీబీ ఇంటెలిజెన్స్ అధికారిగా పనిచేసిన పుతిన్ 24 ఏండ్ల పాటు ఆ దేశానికి అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.