Pakistan : పాకిస్థాన్‌కు జేఎఫ్-17 తెచ్చిపెట్టిన కొత్త చిక్కులు!
డిమాండ్ ఎక్కువ, ఉత్పత్తి సామర్థ్యం తక్కువ..
పాకిస్థాన్, చైనా సంయుక్తంగా రూపొందించిన జేఎఫ్-17 థండర్ యుద్ధ విమానానికి అంతర్జాతీయంగా గిరాకీ ఎక్కువైంది. ఇటీవల భారత్‌తో జరిగిన సరిహద్దు ఘర్షణల్లో ఈ విమానాలు మెరుగైన ప్రదర్శన కనబరిచాయని పాక్ చేసిన ప్రకటనల నేపథ్యంలో.. పలు దేశాలు వీటి కొనుగోలుకు చేసేందుకు పెద్ద ఎత్తున ఆసక్తి కనబరుస్తున్నాయి. అయితే ఒక్కసారిగా పెద్ద ఎత్తున డిమాండ్ పెరగడంతో పాకిస్థాన్ తల పట్టుకుంటోంది. ఈ యుద్ధ విమానాల అమ్మకం ద్వారా బాగా డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉన్నా, ఆర్థిక సంక్షోభం నుంచి బయట పడే ఛాన్స్ వచ్చినా.. ఉత్పత్తి సామర్థ్యం లేక నేల చూపులు చూస్తోంది.
గత కొద్ది నెలలుగా ఇరాక్, బంగ్లాదేశ్, ఇండోనేషియా, లిబియా దేశాలు ఈ విమానం పట్ల తీవ్ర ఆసక్తిని కనబరుస్తున్నాయి. ముఖ్యంగా సౌదీ అరేబియా ఏకంగా తన అప్పులను ఈ విమాన ఒప్పందంగా మార్చుకోవాలని యోచిస్తుండటం దౌత్య వర్గాల్లో సంచలనంగా మారింది. అంతేకాకుండా పాశ్చాత్య దేశాల విమానాలపై ఆధారపడే సౌదీ అరేబియా, ఇండోనేషియా వంటి దేశాలు జేఎఫ్-17 వైపు మొగ్గు చూపడం.. రక్షణ రంగంలో కీలక మార్పుగా నిపుణులు భావిస్తున్నారు.
జేఎఫ్-17 విమానాల క్రేజ్‌కు కారణమిదే..!
ముఖ్యంగా జేఎఫ్-17 విమానాలకు ఇంతలా క్రేజ్ పెరగడానికి ప్రధాన కారణం దాని ధర. పాశ్చాత్య దేశాల విమానాలు అయిన రఫేల్, ఎఫ్-16 ఒక్కొక్కటి 100 మిలియన్ డాలర్లకు పైగా ఖర్చ అవుతుంటే.. జేఎఫ్-17 కేవలం 40 నుంచి 50 మిలియన్ డాలర్లకే లభిస్తోంది. తక్కువ బడ్జెట్ ఉన్న దేశాలకు ఇది ఒక గొప్ప ప్రత్యామ్నాయంగా మారడంతో.. అందరి కన్ను దీనిపై పడింది. అయితే ప్రస్తుతం పాకిస్థాన్ ఏరోనాటికల్ కాంప్లెక్స్ ఏడాదికి కేవలం 16 నుంచి 20 విమానాలను మాత్రమే తయారు చేయగలదు. వీటిలో అత్యధిక భాగం పాక్ వైమానిక దళానికే సరిపోతాయి. ప్రస్తుతం ఎగుమతుల కోసం దాదాపు 45 ఆర్డర్లు పెండింగ్‌లో ఉన్నాయి.
దీనికి తోడు ఉత్పత్తిని పెంచడానికి పాకిస్థాన్‌కు భారీ నిధులు అవసరం. కానీ ప్రస్తుతం ఆ దేశ ఆర్థిక పరిస్థితి అందుకు సహకరించడం లేదు. అలాగే జేఎఫ్-17లో వాడే ఇంజిన్లను రష్యాకు చెందిన 'క్లిమోవ్' కంపెనీ సరఫరా చేస్తోంది. ఉక్రెయిన్ యుద్ధం కారణంగా రష్యాపై ఉన్న ఆంక్షలు ఇంజిన్ల సరఫరాకు అడ్డంకిగా మారే అవకాశం కూడా లేకపోలేదు. ఇది చాలదన్నట్లుగా రష్యాకు భారత్ పెద్ద కస్టమర్ కావడంతో.. పాకిస్థాన్‌కు విడిభాగాల సరఫరా విషయంలో ఆ దేశం ఏ నిర్ణయం తీసుకుంటుందనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది.
ఇదిలా ఉండగా.. ఈ యుద్ధ విమానాల తయారీ ప్రాజెక్టులో చైనా వాటా 42 శాతం కాగా పాకిస్థాన్ వాటా 58 శాతంగా ఉంది. మరి పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా చైనా.. పాకిస్థాన్‌కు ఆర్థిక సాయం అందించి పెద్ద ఎత్తున వ్యాపారం సాగిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉండగా.. ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న 45 విమానాలను పాక్ సకాలంలో పూర్తి చేస్తుందా లేదా అనే అంతా ఆసక్తిగా గమనిస్తున్నారు. ఒకవేళ పాక్ ఈ ఆర్డర్లను సకాలంలో పూర్తి చేయగలిగితే.. ప్రపంచ ఆయుధ మార్కెట్లో ఆ దేశం ఒక కీలక శక్తిగా ఎదిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. చూడాలి మరి ఏం జరగనుంది అనేది.