Saudi Arabia: క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్‌పై సంచలన ఆరోపణలు..
యుద్దం కోసం తండ్రి సంతకం ఫోర్జరీ చేశాడన్న మాజీ అధికారి.;
యెమెన్‌లోని హుతీ రెబల్స్‌పై సౌదీ అరేబియా చేసిన యుద్ధ ప్రకటనలో రాజు సల్మాన్ సంతకాన్ని యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ (ఎంబీఎస్) ఫోర్జరీ చేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ దేశానికి చెందిన మాజీ అధికారే ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ ప్రచారంపై రియాద్ నోరుమెదపలేదు.
సౌదీ ఇంటెలిజెన్స్ అధికారి సాద్ అల్ జబ్రీ ఇంటర్వ్యూను ఇటీవల బీబీసీ ప్రచురించింది. ఇక ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ రియాద్‌లోని నమ్మకమైన మిత్రుల ద్వారా తెలిసిన దాని ప్రకారం ‘యెమెన్‌పై యుద్ధ ప్రకటనలో ఎంబీఎస్ తన తండ్రి సంతకాన్ని ఫోర్జరీ చేశారు. పదాతి దళ ఆక్రమణకు దానిలో ఆదేశాలున్నాయి. రాజు మానసికస్థితి బాగోకపోవడంతో ఎంబీఎస్ ఫోర్జరీకి పాల్పడ్డారు’ అని వ్యాఖ్యానించాడు. అల్ జబ్రీ గతంలో క్రౌన్ ప్రిన్స్‌గా ఉన్న మహమ్మద్ బిన్ నయిఫ్ సమయంలో ఇంటెలిజెన్స్ అధికారిగా పనిచేశాడు. అమెరికాకు అల్‌ఖైదాపై యుద్ధంలో నమ్మిన బంటుగా వ్యవహరించాడు. ప్రస్తుతం అతడు కెనడాలో ప్రవాసజీవితం గడుపుతున్నాడు. కొన్నేళ్లుగా అతడికి సౌదీ ప్రభుత్వంతో వివాదం నడుస్తోంది. అతడి ఇద్దరు పిల్లలు ఇప్పుడు రియాద్ ఖైదులో ఉన్నారు.
సౌదీ అరేబియాకు అప్రకటిత రాజుగా ఎంబీఎస్ కొనసాగుతున్నారు. తన తండ్రి బదులు ఆయనే నేరుగా ప్రపంచ నేతలతో భేటీ అవుతున్నారు. 2015లో యెమెన్‌పై యుద్ధం మొదలుకాగానే సౌదీపై కూడా ఎంబీఎస్ పట్టు బిగుస్తూ వచ్చింది. యెమెన్‌పై సౌదీ చేపట్టిన యుద్ధంలో దాదాపు 1,50,000 మంది మరణించారు. చాలా వేగంగా పూర్తి చేస్తామనుకొన్న ఇది కొన్నేళ్లపాటు కొనసాగింది. ప్రపంచంలోనే అతిపెద్ద మానవీయ సంక్షోభానికి కారణమైంది. ఈ యుద్ధం మొదలైన వేళ ఎంబీఎస్ సౌదీ రక్షణ మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించారు.