Trump: ట్రంప్‌తో షరీఫ్, మునీర్ 90 నిమిషాలు రహస్య చర్చలు..

ఆహ్లాదకరంగా జరిగిందని పాక్ పీఎంవో వెల్లడి, మీడియాకు నో ఎంట్రీ

Update: 2025-09-26 05:30 GMT

వైట్‌హౌస్‌లో ట్రంప్‌తో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ సమావేశం అయ్యారు. దాదాపుగా 90 నిమిషాల పాటు రహస్య చర్చలు జరిగాయి. మీడియాను లోపలికి అనుమతించలేదు. ఈ సమావేశంలో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో కూడా పాల్గొన్నారు. అయితే ఈ సమావేశం ఆహ్లాదకరంగా జరిగిందని పాకిస్థాన్ ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. అత్యంత ముఖ్యమైన అంశాలు, భద్రతపై దృష్టి పెట్టినట్లుగా పేర్కొంది. ఇక ట్రంప్‌తో షరీఫ్ సమావేశం కావడం ఇదే తొలిసారి.

ఆప్ఘనిస్థాన్‌లోని బాగ్రామ్ వైమానిక స్థావరాన్ని స్వాధీనం చేసుకుంటామని ఇప్పటికే ట్రంప్ ప్రకటించారు. ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోమని తాలిబన్లు తేల్చి చెప్పారు. అయితే బాగ్రామ్ వైమానిక స్థావరం స్వాధీనం చేసుకునే క్రమంలో పాకిస్థాన్ సహకారాన్ని ట్రంప్ కోరినట్లు సమాచారం. ఆ ప్రాంతంలో చైనా ప్రాబల్యం పెరగడంతో బాగ్రామ్ వైమానిక స్థావరాన్ని స్వాధీనం చేసుకునేందుకు అమెరికా ప్రయత్నిస్తోంది. ఈ విషయంలో అమెరికాకు పాకిస్థాన్ సహకరిస్తే మాత్రం శత్రువుగా చూడాల్సి వస్తుందని తాలిబన్లు హెచ్చరించారు. అంతేకాకుండా సరిహద్దులో ఆప్ఘనిస్థాన్ నుంచి ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటోంది. ఈ విషయంలో అమెరికా సహాయాన్ని పాకిస్థాన్ కోరినట్లు సమాచారం.

ఇక జో బైడెన్ హయాంలో నిలిపివేయబడిన అమెరికా-పాకిస్థాన్ సైనిక శిక్షణ, మార్పిడి కార్యక్రమాలను పునరుద్ధరించాలని అసిమ్ మునీర్.. ట్రంప్‌ను కోరారు. మునీర్ అభ్యర్థనకు ట్రంప్ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. తిరిగి ప్రవేశపెట్టేందుకు పరిశీలిస్తానని హామీ ఇచ్చినట్లు సమాచారం. ఇక ఉమ్మడి ఉగ్రవాద నిరోధక కమాండ్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆప్ఘనిస్థాన్ నుంచి ఎదురయ్యే సీమాంతర ఉగ్రవాదం, బలూచిస్థాన్‌లో అశాంతి, కాశ్మీర్‌పై కూడా చర్చించినట్లు సమాచారం. పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని షరీఫ్, మునీర్‌కు ట్రంప్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News