United States: వింత సంఘటన.. మనిషిని కాల్చి చంపిన కుక్క..

United States: మనుషుల కంటే తుపాకులు ఎక్కువగా ఉన్న యునైటెడ్ స్టేట్స్‌లో ప్రమాదవశాత్తు కాల్పులు జరగడం చాలా సాధారణం.

Update: 2023-01-25 09:52 GMT

United States: మనుషుల కంటే తుపాకులు ఎక్కువగా ఉన్న యునైటెడ్ స్టేట్స్‌లో ప్రమాదవశాత్తు కాల్పులు జరగడం చాలా సాధారణం. US సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ డేటా ప్రకారం, 2021లో తుపాకీ ప్రమాదాల్లో 500 మందికి పైగా మరణించినట్లు నివేదికలు తెలుపుతున్నాయి.

తాజా సంఘటన కొంత విచిత్రమైంది. కారు వెనుక సీట్లో తమ పెట్ డాగ్‌తో పాటు తుపాకీని కూడా ఉంచి వేటకు బయల్దేరారు. దిగే టైమ్‌లో కుక్క రైఫిల్ మీద కాలేసింది. అంతే తుపాకీ గుండు ఒక్కసారిగా పేలి ముందు సీట్లో కూర్చున్న వ్యక్తి తలలోకి దూసుకుపోయింది. దాంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఈ విషయాన్ని యునైటెడ్ స్టేట్స్‌‌లోని సమ్మర్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం తెలిపింది.

కాన్సాస్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ట్రక్కు ముందు ప్రయాణీకుల సీటులో కూర్చున్న బాధితుడికి తుపాకీ గుండు తగిలింది. ఈస్ట్ 80వ స్ట్రీట్‌లోని 1,600 బ్లాక్‌ ట్రక్కులో ఉదయం 9.40 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది.

డ్రైవర్ సీటులో ఉన్న మరో వ్యక్తి క్షేమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కుక్క రైఫిల్‌పై కాలు మోపడంతో ఈ అనర్ధం చోటు చేసుకుంది. అయితే, చనిపోయిన 30 ఏళ్ల వ్యక్తి కుక్క యజమాని అవునా, కాదా అనేది తెలియలేదు. దీనిపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

Tags:    

Similar News