Imran Khan: ఇమ్రాన్ ఖాన్‌కు మంచి సదుపాయాలు, చికిత్స అందించండి, పాక్ ప్రభుత్వానికి క్రికెట్ దిగ్గజాల లేఖ

ఇమ్రాన్ ఖాన్ కోసం పాక్ ప్రభుత్వానికి సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్ లేఖ..

Update: 2026-02-18 01:37 GMT

 పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైల్లో దుర్భర పరిస్థితుల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఆయన ఆరోగ్యం దెబ్బతిందని, కంటి చూపు కూడా మందగించిందని ఇటీవల వార్తలు కూడా వచ్చాయి. ఈ క్రమంలో ఇమ్రాన్ ఖాన్ కు భారత క్రికెట్ లెజెండ్స్ అండగా నిలించారు. ఇమ్రాన్ కు మద్దతుగా లేఖ రాశారు. జైల్లో ఉన్న ఇమ్రాన్ ఖాన్‌కు మంచి సదుపాయాలు, చికిత్స అందించాలని పాక్ ప్రభుత్వానికి 14 మంది మాజీ క్రికెటర్లు ‘అంతర్జాతీయ మాజీ క్రికెట్ కెప్టెన్స్’ పేరిట లేఖ రాశారు. వీరిలో భారత లెజెండ్స్ కపిల్ దేవ్, గవాస్కర్ కూడా ఉన్నారు.

పాకిస్తాన్ కు 1992 వరల్డ్ కప్ అందించారు ఇమ్రాన్ ఖాన్. 2018-2022 మధ్య ఆ దేశ ప్రధానిగా ఉన్నారు. అవినీతి ఆరోపణలతో జైల్లో ఉన్న ఇమ్రాన్ ఆరోగ్యం క్షీణించిందని, కుడి కన్ను 85శాతం చూపు కోల్పోయిందని ఇటీవల.. ఆయన తరపు న్యాయవాది పాక్ సుప్రీంకోర్టుకు తెలియజేశారు. దీంతో ఇమ్రాన్ కుటుంబసభ్యులు, అభిమానులు మరింత ఆందోళన చెందుతున్నారు.

ఇమ్రాన్ ఖాన్ దుర్భర పరిస్థితి చూసి మాజీ క్రికెటర్లు చలించిపోయారు. ఆయనతో కలిసి క్రికెట్ ఆడిన వారు ఆవేదనగా ఉన్నారు. ఈ కష్టకాలంలో ఇమ్రాన్ కు అండగా నిలిచారు. భారత క్రికెట్ హీరోలు సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్ సహా మైఖేల్ అథర్టన్, అలన్ బోర్డర్, మైఖేల్ బ్రెయర్లీ, గ్రెగ్ చాపెల్, ఇయాన్ చాపెల్, బెలిండా క్లార్క్, డేవిడ్ గోవర్, కిమ్ హ్యూస్, నాజర్ హుస్సేన్, క్లైవ్ లాయిడ్, స్టీఫెన్ వా, జాన్ రైట్ ఉన్నారు. 1992 వరల్డ్ కప్ విజయంలో ఇమ్రాన్ ఖాన్ పాత్రను లేఖలో హైలెట్ చేశారు. ఇమ్రాన్ ఖాన్ క్రికెట్ చూసిన అత్యుత్తమ ఆల్‌ రౌండర్లు, కెప్టెన్లలో ఒకరని లేఖలో పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 14 మంది క్రికెట్ దిగ్గజాలు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కు లేఖ రాశారు. ఇమ్రాన్ ఖాన్ ను సొంత దేశస్తులే పట్టించుకోని పరిస్థితుల్లో.. ఊహించని విధంగా మాజీ క్రికెటర్ల నుంచి ఆయనకు మద్దతు లభించింది.

Tags:    

Similar News