Susan Coyle: ఆస్ట్రేలియా ఆర్మీ పగ్గాలు చేపట్టిన తొలి మహిళ..

125 ఏళ్ల తర్వాత ఆర్మీ చీఫ్‌గా మ‌హిళ‌.. ప్ర‌క‌టించిన ప్ర‌ధాని అల్బ‌నీస్‌

Update: 2026-04-14 07:45 GMT

ఆస్ట్రేలియా రక్షణ రంగంలో చారిత్రాత్మక మార్పు చోటుచేసుకుంది. 125 ఏళ్ల ఆస్ట్రేలియా సైనిక చరిత్రలో ఎన్నడూ లేని విధంగా.. ఒక మహిళా అధికారిణిని సైన్యాధిపతిగా నియమించారు. ప్రస్తుతం జాయింట్ కేపబిలిటీస్ చీఫ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న లెఫ్టినెంట్ జనరల్ సూసన్ కోయల్‌.. జూలై నుంచి ఆస్ట్రేలియా ఆర్మీ పగ్గాలను చేపట్టనున్నారు. ఈ మేరకు ఆ దేశ ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బనీస్ సోమవారం అధికారిక ప్రకటన విడుదల చేశారు.

125 ఏళ్ల తర్వాత మహిళకు పట్టం..

లెఫ్టినెంట్ జనరల్ సైమన్ స్టువర్ట్ స్థానంలో సూసన్ కోయల్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ నియామకంపై ప్రధాని అల్బనీస్ స్పందిస్తూ.. "ఆస్ట్రేలియా ఆర్మీ చరిత్రలో తొలి సారిగా ఒక మహిళా చీఫ్ నాయకత్వం వహించబోతున్నారు. ఇది దేశానికే గర్వ కారణం" అని కొనియాడారు. రక్షణ మంత్రి రిచర్డ్ మార్లెస్ సైతం ఈ నిర్ణయాన్ని ఒక చారిత్రక క్షణంగా అభివర్ణించారు. "మనం ఏదైతే చూడలేమో. అది కాలేము" అన్న సూసన్ మాటలను గుర్తు చేస్తూ.. భవిష్యత్తులో సైన్యంలో చేరాలనుకునే వేలాది మంది మహిళలకు ఆమె ఒక ఆదర్శ అధికారణిగా నిలుస్తారని పేర్కొన్నారు.

సవాళ్ల మధ్య బాధ్యతల స్వీకరణ..

55 ఏళ్ల సూసన్ కోయల్ 1987లో సైన్యంలో చేరారు. తన సుదీర్ఘ కెరీర్‌లో ఆమె అనేక కీలక పదవులను చేపట్టారు. తనదైన పనితనంతో ప్రతీచోటా తన మార్కును చూపెట్టారు. ఈ విషయాలను గుర్తించే సర్కారు ఆమెకు ఆర్మీ చీఫ్ ‌బాధ్యతలను అప్పగించబోతోంది. అయితే ఆమె ఈ బాధ్యతలు చేపడుతున్న సమయం అత్యంత కీలకంగా నిలుస్తోంది. ఎందుకంటే ఆస్ట్రేలియా రక్షణ దళాల్లో (ADF) మహిళా సైనికులపై జరుగుతున్న లైంగిక వేధింపులు, వివక్షపై ఇటీవల భారీగా ఆరోపణలు వెల్లువెత్తాయి. గత అక్టోబర్‌లో సైన్యంపై ఒక సామూహిక దావా కూడా దాఖలైంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో సైన్యంలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడం, వారి రక్షణకు భరోసా కల్పించడం సూసన్ ముందున్న ప్రధాన సవాళ్లు కాగా.. అంతా ఆసక్తిగా ఆమె ఏం చేయనున్నారని చూస్తున్నారు.

రక్షణ దళాల నాయకత్వంలో మరికొన్ని కీలక నియామకాలను కూడా ప్రభుత్వం చేపట్టింది. ప్రస్తుతం నేవీ చీఫ్‌గా ఉన్న వైస్ అడ్మిరల్ మార్క్ హమ్మండ్‌ను రక్షణ దళాల అధిపతిగా నియమించారు. మార్క్ హమ్మండ్ స్థానంలో రియర్ అడ్మిరల్ మాథ్యూ బక్లీ నూతన నేవీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరిస్తారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా రక్షణ దళాల్లో మహిళల భాగస్వామ్యం 21 శాతంగా ఉండగా.. 2030 నాటికి దీనిని 25 శాతానికి పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

Tags:    

Similar News