Gaza-Israel: రఫాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్‌.. తాజా దాడుల్లో 26 మంది మృతి

గాజాలో మళ్లీ టెన్షన్ వాతావరణం..

Update: 2025-10-20 05:15 GMT

ఇజ్రాయెల్, హమాస్‌ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సంతకం చేసి వారం రోజులైనా కాలేదు.. అప్పుడే ఒప్పందంపై నీలినీడలు ముసురుకున్నాయి. కాల్పుల విరమణను మీరు ఉల్లంఘిస్తున్నారంటే కాదు మీరంటూ హమాస్, ఇజ్రాయెల్‌ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. హమాస్‌ మిలిటెంట్లు తమ సైనికులపై కాల్పులు జరిపారని పేర్కొంటూ ఇజ్రాయెల్‌ ఆదివారం దక్షిణ గాజాలోని రఫా నగరంపై వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఖాన్‌ యూనిస్‌పైనా బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో 19 మంది పాలస్తీనియన్లు మృతి చెందారని స్థానిక ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ఇజ్రాయెల్‌ అంతటితో ఆగలేదు. గాజాలోకి ప్రవేశిస్తున్న మానవతా సాయాన్ని కూడా నిలిపివేస్తున్నట్లు పేర్కొంది. దీనిపై ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల కాలేదు. ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు కూడా దూకుడుగా వ్యవహరిస్తున్నారు.. కాల్పుల విరమణ ఉల్లంఘనలకు హమాస్‌ పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలని సైన్యాధికారులను ఆదేశించారు. అయితే రఫా ఘర్షణలకు తమకు సంబంధం లేదని హమాస్‌ ప్రకటించింది. ఆ నగరంలో ఏం జరుగుతోందో కూడా తెలియదని పేర్కొంది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పక్కదోవ పట్టించేందుకు గాజాలోని పౌరులపై దాడులు చేసేందుకు తాము ప్రణాళికలు రచిస్తున్నామంటూ అమెరికా విదేశాంగ శాఖ చేసిన ప్రకటనను కూడా హమాస్‌ తప్పుబట్టింది. ఇది ఇజ్రాయెల్‌ చేస్తున్న ప్రచారం మాత్రమేనని పేర్కొంది. కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా మరో ఇద్దరు బందీల మృతదేహాలను శనివారం హమాస్‌ అప్పగించింది. ఇంకా 16 భౌతికకాయాలను ఇజ్రాయెల్‌కు అప్పగించాల్సి ఉంది.

హమాస్‌ చెరలో మృతి చెందిన నేపాల్‌వాసి బిపిన్‌ జోషికి బెన్‌ గురియన్‌ విమానాశ్రయంలో ఇజ్రాయెల్‌ వీడ్కోలు పలికింది. ఆ యువకుడి మృతదేహాన్ని ఆదివారం నేపాల్‌కు తరలించారు. నేపాల్‌లో వ్యవసాయ విద్యను అభ్యసిస్తున్న జోషి.. అంతర్జాతీయ వ్యవసాయ శిక్షణ కార్యక్రమంలో భాగంగా ఇజ్రాయెల్‌కు వచ్చారు. 2023 అక్టోబరు ఏడున ఇజ్రాయెల్‌పై హమాస్‌ దాడి చేసిన సమయంలో బాంబు షెల్టర్‌లో దాక్కొన్న జోషిని హమాస్‌ బంధించి గాజాకు తీసుకెళ్లింది. తాజాగా కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన తర్వాత జోషి మృతదేహాన్ని ఇజ్రాయెల్‌కు హమాస్‌ అప్పగించింది.

రెండేళ్ల తర్వాత అక్టోబర్ 10న ఈజిప్టు వేదికగా గాజా శాంతి ఒప్పందం జరిగింది. ఇరు పక్షాలు కూడా శాంతి ఒప్పందానికి అంగీకరించాయి. హమాస్ ఉగ్రవాదులు బందీలను విడుదల చేయగా.. ఇజ్రాయెల్ పాలస్తీనా ఖైదీలను విడిచిపెట్టింది. కానీ కొద్దిరోజులకే మళ్లీ పరిస్థితులు మొదటికొచ్చాయి.

Tags:    

Similar News