RUSSIA_UKRAINE WAR: ఉక్రెయిన్‌కు అండగా జీ 7 దేశాలు

దీర్ఘకాల రక్షణ అవసరాలు తీరుస్తామని జీ 7 దేశాల హామీ... ఉక్రెయిన్‌ను బలోపేతం చేస్తామన్న బైడెన్‌... ఇదీ సగం విజయమే అన్న జెలెన్‌ స్కీ...

Update: 2023-07-13 04:15 GMT

 ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మిలటరీ కూటమి ఉక్రెయిన్‌కు మద్దతుగా నిలిచింది. దీర్ఘకాలిక రక్షణ అవసరాలు తీరుస్తామని హామీనిచ్చింది. రష్యా(Russia)తో యుద్ధం(war) భీకరంగా సాగుతున్న వేళ ఉక్రెయిన్‌(Ukraine) రక్షణ అవసరాలను తీరుస్తామని... అవసరమైన ఆయుధాలందిస్తామని నాటో(NATO)లోని G7 దేశాలు( G7 countries) హామీనిచ్చాయి. లిథువేనియాలో జరిగిన రెండు రోజుల నాటో కూటమి శిఖరాగ్ర భేటీ అనంతరం విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో ఉక్రెయిన్‌కు అన్ని విధాలుగా అండగా ఉంటామని, ఆ దేశాన్ని బలోపేతం చేస్తామని నాటో దేశాలు వెల్లడించాయి. సభ్యత్వం ఇవ్వకున్నా ఉక్రెయిన్‌పై నాటో కూటమి వరాల వాన కురిపించింది.


ఉక్రెయిన్‌తో జీ-7 దేశాలు (అమెరికా, బ్రిటన్, కెనడా, ఫ్రాన్స్‌, ఇటలీ, జర్మనీ, జపాన్‌) విడివిడిగా ఒప్పందాలు చేసుకుంటాయి. నాటో-ఉక్రెయిన్‌ కౌన్సిల్‌నూ ఏర్పాటు చేశారు. ఉక్రెయిన్‌-నాటో కౌన్సిల్‌లో భాగంగా 31 నాటో దేశాలు ఉక్రెయిన్‌తో విడివిడిగా అవసరమైనప్పుడల్లా సమావేశమవుతాయి. ఈ వరాలపై ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ(President Volodymyr Zelensky) హర్షం వ్యక్తం చేశారు. నాటోలో సభ్యత్వం ఇవ్వకపోవడం వల్ల ఇది అర్ధవంతమైన విజయంగా అభివర్ణించారు. తమ దేశానికి, ప్రజలకు, పిల్లలకు, వారి భవితకు సంతోషకరమైన వార్తతో స్వదేశం తిరిగి వెళుతున్నా అని భావోద్వేగానికి గురయ్యారు. నాటోలో సభ్యత్వానికి ఇది పునాది వేస్తుందని ఆశిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. భవిష్యత్‌లోనూ ఉక్రెయిన్‌కు తమ మద్దతు కొనసాగుతుందని, ఆ దేశ రక్షణ వ్యవస్థను సుదృఢం చేస్తామని అమెరికా అధ్యక్షుడు బైడెన్‌(US PRESIDENT BIDEN) హామీ ఇచ్చారు. ఉక్రెయిన్ పట్ల తమ నిబద్ధతక ఇదే శక్తివంతమైన ప్రకటన అని అగ్రరాజ్య అధ్యక్షుడు వెల్లడించారు.


ఉక్రెయిన్‌కు జీ-7 సాయంపై రష్యా మండిపడింది. ఇది అత్యంత అవివేక నిర్ణయమని, ప్రమాదకరమని రష్యా అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్‌ మండిపడ్డారు. జెలెన్‌స్కీ పదేపదే ఆయుధాల కోసం డిమాండు చేయడాన్ని బ్రిటన్‌ రక్షణ మంత్రి బెన్‌ వాలెస్‌ కూడా తప్పుబట్టారు. అడగ్గానే డెలివరీ చేసేందుకు ‘మేమేమైనా అమెజానా’ అని ప్రశ్నించారు. స్వీడన్‌ నాటో సభ్యత్వానికి అక్టోబరు కంటే ముందు తమ పార్లమెంటు ఆమోదం తెలిపే అవకాశం లేదని తుర్కియే అధ్యక్షుడు తయ్యిప్‌ ఎర్డోగాన్‌ స్పష్టం చేశారు.

Tags:    

Similar News