Justin Trudeau: ట్రంప్ వ్యాఖ్యలను ఖండించిన ట్రూడో..
ఎట్టి పరిస్థితుల్లోనూ కెనడా అమెరికాలో విలీనం కాదు: ప్రధాని జస్టిన్ ట్రూడో;
కెనడా ప్రధానిగా రాజీనామా చేస్తున్నట్లు జస్టిన్ ట్రూడో ప్రకటించిన కొన్ని గంటలకే అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘కెనడా 51వ రాష్ట్రంగా విలీనం’ ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చాడు. ఈ ప్రతిపాదనపై ట్రూడో తాజాగా స్పందించారు. కెనడా అమెరికాలో భాగమయ్యే అవకాశమే లేదని ఎక్స్ వేదికగా వెల్లడించారు. రెండు దేశాలలోని కార్మికులు, వాణిజ్యం, భద్రతా భాగస్వామ్యం ద్వారా ప్రజలు లాభపడుతున్నారని అతడు తెలిపాడు.
కాగా, ఇటీవల కెనడా, మెక్సికోలపై 25 శాతం పన్నూ విధించనున్నట్లు డొనాల్డ్ ట్రంప్ చెప్పాడు. ఆ తర్వాత ట్రూడో ట్రంప్‌తో సమావేశం అయ్యారు. అందులో వలసలు, డ్రగ్స్ అక్రమరవాణాను సరిహద్దుల్లోనే కట్టడి చేయాలి.. లేకపోతే సుంకాలను పెంచుతానని అమెరికాకు కాబోయే అధ్యక్షుడు హెచ్చరించారు. ఇందులో విఫలమైతే అమెరికాలో 51వ రాష్ట్రంగా చేరాలని ట్రూడోకు ఈ సందర్భంగా చురకలంటించారని సమాచారం. ఈ క్రమంలో ‘గవర్నర్ ఆఫ్ కెనడా’ అంటూ ట్రూడోను వ్యంగ్యంగా వ్యాఖ్యనించాడు ట్రంప్.
మరోవైపు.. జస్టిన్ ట్రూడో తన ప్రధాని పదవికి త్వరలో రాజీనామా చేయబోతున్నట్లు తెలిపాడు. లిబరల్ పార్టీ నాయకత్వ బాధ్యతల నుంచి కూడా తప్పుకుంటున్నట్లు చెప్పాడు. తన వారసుడిని పార్టీ ఎంపిక చేసే వరకూ తాత్కాలిక ప్రధానిగా పదవిలో కొనసాగుతానని స్పష్టం చేశాడు. పార్టీ పదవితో పాటు ప్రధాని బాధ్యతలు మార్క్ కార్నీ, లీ బ్లాంక్‌లలో ఒకరు ఇవ్వబోతున్నారని టాక్. ఈ నేపథ్యంలోనే కెనడా 51వ రాష్ట్రంగా చేరాలనే ప్రతిపాదనను ట్రంప్ మరోసారి గుర్తు చేశారు. అమెరికాలో భాగస్వామ్యం కావడం కెనడాలోని చాలా మంది ప్రజలు ఇష్టపడుతున్నారని వెల్లడించారు. అమెరికాలో విలీనమైతే ఈ సుంకాలు, అధిక పన్నులు ఉండవని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నాడు.