Threads: సోషల్ మీడియాను దున్నేస్తున్న థ్రెడ్స్ యాప్
యూజర్లకు అందుబాటులోకి థ్రెడ్స్ యాప్.... నాలుగు గంటల్లోనే 50 లక్షల సైన్ అప్‌లు.. ట్విట్టర్‌కు పోటీగా తెచ్చిన జుకర్‌బర్గ్...;
నెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూసిన క్షణం రానే వచ్చింది. ఎలాన్ మస్క్‌కు షాకిస్తూ ట్విట్టర్‌కు పోటీగా... మోటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ తీసుకొచ్చిన థ్రెడ్స్ యాప్ యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. వచ్చి రావడంతోనే సోషల్ మీడియాను షేక్ చేసేస్తోంది. అందుబాటులోకి వచ్చిన రెండు గంటల్లోనే 20 లక్షల మంది థ్రెడ్స్ యాప్‌లో సైన్ అప్ అయ్యారు. తొలి నాలుగు గంటల్లోనే 50 లక్షల మంది థ్రెడ్ యాప్ సైన్ అప్‌లను ఆమోదించారని జుకర్‌బర్గ్ ట్వీట్ చేశాడు. ఇన్‌స్టాగ్రామ్ బృందం ఈ యాప్‌ను అభివృద్ధి చేసింది. రియల్ టైమ్ ఫీడ్ థ్రెడ్స్‌లో అందుబాటులో ఉంటుంది. ఫీచర్లు, ఇంటర్ ఫేస్ మొత్తం దాదాపు ట్విట్టర్‌ను పోలి ఉంది. ఈ యాప్ భారత్‌లోనూ అందుబాటులోకి వచ్చింది.
గూగుల్ ప్లే స్టోర్ నుంచి థ్రెడ్స్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్‌లో బ్లూ టిక్ ఉంటే.. థ్రెడ్స్ యాప్‌లోనూ అకౌంట్ ఆటోమేటిక్‌గా ధ్రువీకరించబడుతుంది. యాప్‌ను యాపిల్ స్టోర్ నుంచి సైతం ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. థ్రెడ్ యాప్‌లో ఇన్‌స్టా ఐడీతో లాగిన్ చేసుకోవచ్చు. థ్రెడ్స్ ట్విట్టర్ మాదిరిగానే టెక్స్ట్ ఆధారిత సోషల్ మీడియా యాప్. ప్రస్తుతం ట్విట్టర్‌ను ఉపయోగిస్తున్న వారికి.. థ్రెడ్స్‌ను వాడడంలో ఎలాంటి సమస్యలుండవు.
థ్రెడ్స్ యాప్ ఇలాగే ప్రభంజనం సృష్టిస్తే ట్విట్టర్‌ను వెనక్కి నెట్టడం పెద్ద కష్టమేమీ కాదని నెటిజన్లు భావిస్తున్నారు. ప్రస్తుతం ఇన్‌స్టాలో ఉన్న వినియోగదారుల్లో నాలుగింట ఒక శాతం మంది థ్రెడ్స్ యాప్‌కు సైన్ అప్ అయినా ట్విట్టర్‌ను దాటేస్తుంది. ట్విట్టర్‌ను మళ్లీ గాడిన పెట్టేందుకు సీఈఓ లిండా యాకారినో తీవ్రంగా కష్టపడుతున్న వేళ వారి ఆశలపై థ్రెడ్స్ యాప్ నీళ్లు చల్లే అవకాశం ఉందన్న అంచనాలు ఉన్నాయి. కొందరేమో థ్రెడ్స్ యాప్ అంత ప్రభావం చూపడం కష్టమని భావిస్తున్నారు. థ్రెడ్ యాప్ ట్విట్టర్‌ను దాటేస్తుందా అన్న ప్రశ్నకు దానికి కొంత సమయం పడుతుందని జుకర్ బర్గ్ సమాధానం ఇచ్చారు. సంభాషణలు పంచుకునేందుకు, స్నేహపూర్వక చర్చలకు ఈ యాప్ ఒక మంచి వేదికని అన్నారు. ప్రపంచానికి ఈ స్నేహపూర్వక వేదిక చాలా అవసమరని జుకర్ బర్గ్ వివరించారు.
థ్రెడ్స్ యాప్‌ను ప్రారంభించేందుకు దాదాపు 11 ఏళ్ల తర్వాత జుకర్‌బర్గ్ ట్విట్టర్‌లోకి వచ్చాడు. స్పైడర్‌మ్యాన్ దుస్తులు ధరించిన వ్యక్తి మరొకరిని చూపుతున్నట్లు ట్వీట్ చేశాడు. 1967 స్పైడర్ మాన్ కోసం ఈ డబుల్ ఐడెంటిటీ కార్టూన్ వేశాడు. ట్విట్టర్‌ను పోలీ ఉండే థ్రెడ్స్ యాప్ అని అర్థం వచ్చేలా జుకర్‌బర్గ్ ఈ పోస్ట్ చేసినట్లు నెటిజన్లు భావిస్తున్నారు.