Nobel Prizes in Physics : భౌతికశాస్త్రంలో ముగ్గురికి నోబెల్
కాంతి యొక్క ఆటో సెకండ్ పల్స్‌ను ఉత్పత్తి చేసే పరిశోధనలకు అవార్డు
ప్రతిష్ఠాత్మక నోబెల్ పురస్కారాల ప్రకటనలో భాగంగా రాయల్ స్వీడిష్ అకాడమీఆఫ్ సైన్సెస్ భౌతిక శాస్త్రంలో పురస్కారాన్ని మంగళవారం ప్రకటించింది. ఈ ఏడాది ఈ పురస్కారం ముగ్గురు శాస్త్రవేత్తలను వరించింది. అమెరికాకు చెందిన పెర్రీ అగోస్తిని, జర్మనీకి చెందిన ఫెర్రెన్స్‌క్రౌజ్, స్వీడన్‌కు చెందిన అన్నె ఎల్‌హ్యూలియర్‌కు ఈ ఏడాది నోబెల్‌ను ప్రకటించారు.
అణువుల్లో ఎలక్ట్రానిక్ డైనమిక్స్‌ను అధ్యయనం చేసినందుకు, కాంతి తరంగాలలో సెకండ్ ప ల్స్‌ను ఉత్పత్తి చేసే పరిశోధనలకుగాను వీరికి ఈ పురస్కారాన్ని అందజేస్తున్నట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ వెల్లడించింది. వీరి పరిశోధనలతో అ ణువులు, పరమాణువుల్లో ఎలక్ట్రాన్స్‌ను అధ్యయ నం చేసేందుకు మానవాళికి కొత్త సాధనాలు లభించాయని పేర్కొంది. కాగా బుధవారం రసాయన శాస్త్రం, గురువారం సాహిత్య విభాగాల్లో గ్రహీతలను ప్రకటిస్తారు. శుక్రవారం 2023 నోబెల్ శాంతిబహుమతిని, 9వ తేదీన అర్థశాస్త్రంలో నోబెల్ పురసార గ్రహీతల పేర్లను ప్రకటిస్తారు. హ్యులియర్ భౌతికశాస్త్రంలో నోబెల్ అందుకుంటున్న ఐదో మహిళ కావడం విశేషం. ఈ ముగ్గురు నోబెల్ పురస్కారంతో పాటు 11 మిలియన్ల స్వీడిష్ క్రోనర్, బంగారు పతకం అందుకోనున్నారు. డిసెంబర్ 10న స్టాక్‌హోమ్‌లో ఈ అవార్డును అందజేస్తారు. గతేడాది కూడా ముగ్గురు పరిశోధకులు భౌతికశాస్త్రంలో నోబెల్ పురస్కారం అందుకున్నారు.
ఆటోసెకండ్ అనేది సంక్షిప్త సమయం. ఇది సెకనులో ఒక క్వింటిలియన్ వంతుకు (10 టు ది పవర్ ఆఫ్ 18 సెకండ్స్) సమానం. విశ్వాన్ని నియంత్రించే ప్రాథమిక శక్తులు (ఫండమెంట్ ఫోర్సెస్) గురించి తెలుసుకునేందుకు ఉపయోగించే అనంతమైన సంక్షిప్త సమయమే ఈ ఆటోసెకండ్. ఆటోసెకండ్ పల్స్‌ను అతి తీవ్రత గల లేజర్ వ్యవస్థను ఉపయోగించి ఉత్పత్తి చేస్తారు. పరమాణు, పరమాణు భౌతికశాస్త్రంలో వీటిని విరివిగా వినియోగిస్తారు. ఆటోసెకండ్ పల్స్‌తో ఇప్పటివరకు మన కంటికి కనిపించని అనేక ప్రక్రియలను చూసే వీలు కలిగింది. ఎలక్ట్రాన్ల క్వాంటమ్ మెకానికల్ స్వభావం, రసాయనిక ప్రతిచర్యల సమయంలో ఒకదానితో మరొకటి సంకర్షణ జరుగుతున్నప్పుడు జరిగే మార్పులను దీని ద్వారా గమనించవచ్చు. ఆటోసెకండ్ పల్స్‌లను ఉపయోగించి ఎలక్ట్రాన్లను స్తంభింపజేయవచ్చు. అణువులు, పరమాణువుల్లోని ఎలక్ట్రాన్ల డైనమిక్స్‌ను తెలుసుకోవచ్చు.