ఇటలీ ప్రధాని మెలోనీ గురువారం అమెరికాలో పర్యటించారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో మెలోనీ సమావేశమై సుంకాలపై చర్చించారు. అన్ని దేశాలపై ట్రంప్ భారీగా సుంకాలు పెంచేశారు. దీంతో ప్రపంచ మార్కెట్లు ఘోరంగా దెబ్బ తిన్నాయి. అనంతరం 90 రోజుల పాటు సుంకాలను ట్రంప్ వాయిదా వేశారు.
అయితే సుంకాలపై ట్రంప్-మెలోనీ మధ్య కీలక చర్చలు జరిగాయి. అయితే సుంకాలపై సానుకూల పరిణామాలు చోటుచేసుకున్నట్లు ఓవల్ ఆఫీసులో ట్రంప్-మెలోనీ పేర్కొన్నారు. ఈయూతో సుంకాలపై ఒప్పందం నూటికి నూరు శాతం కుదురుతుందని ట్రంప్ వ్యాఖ్యానించారు. డీల్ విషయంలో తొందరపడడం లేదని తెలిపారు. ఇక పశ్చిమాన్ని గొప్పగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని.. అందుకోసం కలిసి పని చేస్తామని మెలోనీ చెప్పుకొచ్చారు. యూరోపియన్ యూనియన్‌తో సుంకాల ఒప్పందం కుదుర్చుకునే అవకాశాలను డోనాల్డ్ ట్రంప్-జార్జియా మెలోని చర్చించారని వైట్‌హౌస్ పేర్కొంది. ఇరుదేశాల మధ్య సానుకూల చర్చలు జరిగినట్లు వెల్లడించింది. సుంకాలు తగ్గించేందుకు యూరోపియన్ దేశం ముందుకొచ్చింది. ఇక ఇద్దరి మధ్య ఆత్మీయ సమావేశం జరిగింది. ఇద్దరూ కూడా నవ్వుకుంటూ మాట్లాడటం కనిపించింది. ఈ సందర్భంగా మెలోనీ తీరును ట్రంప్ ప్రశంసించారు. అద్భుతం అంటూ ఆమెను ట్రంప్ కొనియాడారు.
ఈయూ ఎగుమతులపై 20 శాతం సుంకాలను విధించిన తర్వాత అమెరికాను సందర్శించిన మొదటి యూరప్ నేతగా మెలోనిగా నిలిచారు. ఇక ఇటలీని సందర్శించాలని ట్రంప్‌ను మెలోనీ ఆహ్వానించారు. మెలోనీ ఆహ్వానాన్ని ట్రంప్ కూడా అంగీకరించారు. ఇక అట్లాంటిక్ మహాసముద్రానికి సంబంధించి రెండు తీరాల మధ్య నెలకొన్న సమస్యలను కూర్చుని పరిష్కారాలను వెతకటానికి ఇదే సరైన సమయం అని మెలోనీ తెలిపారు.
ఇక ఈ సందర్భంగా ట్రంప్ చైనా అంశాన్ని ప్రస్తవించారు. చైనాతో చాలా మంది ఒప్పందం కుదుర్చుకోబోతున్నట్లు చెప్పుకొచ్చారు. అలాగే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం గురించి కూడా ఇద్దరి మధ్య ప్రస్తావనకు వచ్చింది. ఇక పామ్ సండే రోజున ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేయడాన్ని మెలోనీ తప్పుపట్టారు.