అధికారం చేపట్టిన నాటి నుంచి డోనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయాలతో సంచలనంగా మారాడు. సుంకాల మోతతో వాణిజ్య రంగంతో పాటు ఇతర రంగాలు కుదేలై పోయాయి. అక్రమ వలసలను అరికట్టేందుకు కూడా కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పుడు సినిమా రంగంపై ట్రంప్ దృష్టిసారించారు. విదేశీ సినిమాలపై ట్రంప్ సుంకాల మోత మోగించారు. అమెరికన్ చిత్ర పరిశ్రమను పునరుద్ధరించే లక్ష్యంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య శాఖ, యుఎస్ వాణిజ్య ప్రతినిధి (యుఎస్టిఆర్) ను అమెరికా వెలుపల నిర్మించిన అన్ని చిత్రాలపై 100 శాతం సుంకాలు విధించే ప్రక్రియను ప్రారంభించాలని కోరినట్లు ప్రకటించారు.
అమెరికన్ స్టూడియోలు, చిత్రనిర్మాతలు విదేశీ సినిమాలకు లాభదాయకమైన ప్రోత్సాహకాలను అందిస్తున్నాయని విమర్శించారు. ఈ పరిస్థితిని ఆర్థిక, జాతీయ భద్రతకు ముప్పుగా అభివర్ణించారు. అమెరికన్ చిత్ర పరిశ్రమ వేగంగా నాశనం అవుతూందన్నారు. దేశీయ చిత్ర నిర్మాణంలోకి తిరిగి రావాల్సిన అవసరాన్ని ట్రంప్ నొక్కి చెబుతూ, “అమెరికాలో మళ్ళీ సినిమాలు తీయాలని మేము కోరుకుంటున్నాము” అని అన్నారు. కొత్త సుంకాలు అమెరికన్ గడ్డపై స్టూడియోలు తమ కార్యకలాపాలను కొనసాగించడానికి ప్రోత్సహించడానికి తోడ్పడతాయని అన్నారు.