Donald Trump : ఆగస్టు 1 నుంచి భారత్‌పై 25% సుంకాలు.. ట్రంప్ సంచలన ప్రకటన..
పాకిస్థాన్‌తో ట్రంప్ వాణిజ్య ఒప్పందాలు..;
అమెరికా, భారతదేశం మధ్య వాణిజ్య ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. భారత్‌పై 25 శాతం సుంకం విధిస్తామని వెల్లడించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించారు. ఆగస్టు 1 నుంచి కొత్త సుంకం వర్తిస్తుందని ట్రంప్ పేర్కొన్నారు. నిజానికి, వాణిజ్య ఒప్పందం గురించి ఇరు దేశాల మధ్య చాలా రోజులుగా చర్చలు జరుగుతున్నాయి. తాజాగా ట్రంప్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో దీని గురించి సమాచారం ఇచ్చారు.
“భారత్ మా మిత్రదేశం. కానీ గత కొన్ని సంవత్సరాలుగా భారత్ అమెరికా వస్తువులపై ఎక్కువ సుంకాలు విధిస్తోంది. ప్రపంచంలోనే అత్యధికంగా సుంకాలు విధిస్తున్నారు. దీంతో భారత్‌లో అమెరికా వాణిజ్యం తగ్గుతోంది. భారత్ రష్యా నుంచి సైనిక పరికరాలను కొనుగోలు చేస్తోంది. ఇది సరైన నిర్ణయం కాదు. అందరూ రష్యా ఉక్రెయిన్‌పై దాడి ఆపాలని కోరుకుంటున్నారు. కానీ భారతదేశం రష్యాతో వాణిజ్యాన్ని పెంచుతోంది. ఈ విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని, అమెరికా భారతదేశంపై 25 శాతం సుంకం విధించాలని నిర్ణయించింది. ఆగస్టు 1 నుంచి ఇది అమల్లోకి వస్తుంది.” అని ట్రంప్ పేర్కొన్నారు.
ఇప్పుడే పాకిస్థాన్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాం. భారీ చమురు నిల్వల అభివృద్ధికి పాక్‌తో ఒప్పందం కుదిరింది. భాగస్వామ్యానికి నాయకత్వం వహించే ఆయిల్ కంపెనీని గుర్తించే పనిలో ఉన్నాం. పాకిస్థాన్ ఏదో ఒక రోజు భారత్‌కు చమురు విక్రయించవచ్చు. అనే దేశాలు సుంకాలను తగ్గించుకోవాలని అనుకుంటున్నాయి. ఇవన్నీ మన వాణిజ్య లోటును చాలా పెద్ద ఎత్తున తగ్గించడంలో సహాయపడతాయి’ అంటూ ట్రంప్ వెల్లడించారు.
కాగా.. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో అమెరికాకు భారతదేశ ఎగుమతులు 22.8 శాతం పెరిగి 25.51 బిలియన్ డాలర్లకు చేరుకోగా, దిగుమతులు 11.68 శాతం పెరిగి 12.86 బిలియన్ డాలర్లకు చేరుకోవడం గమనించదగ్గ విషయం.