Donald Trump: వైట్‌హౌస్‌లో ట్రంప్ దీపావళి వేడుకలు.. మోదీపై ప్రశంసల వర్షం

ప్రధాని మోదీ తన గొప్ప స్నేహితుడని వ్యాఖ్య

Update: 2025-10-22 00:15 GMT

అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాల్గొని, దీపం వెలిగించి భారత ప్రజలకు, ప్రవాస భారతీయులకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన భారత ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. మోదీ గొప్ప వ్యక్తి అని, తనకు అత్యంత ఆప్తమిత్రుడని కొనియాడారు.

ఈ వేడుకల్లో ట్రంప్ మాట్లాడుతూ.. "భారత ప్రజలందరికీ మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ రోజే నేను మీ ప్రధాని మోదీతో ఫోన్‌లో మాట్లాడాను. మా మధ్య వాణిజ్య సంబంధాలపై గొప్ప సంభాషణ జరిగింది. పాకిస్థాన్‌తో యుద్ధం వద్దనే అంశం కూడా మా మధ్య చర్చకు వచ్చింది. వాణిజ్యంతో పాటు యుద్ధం లేకుండా చూడటం చాలా మంచి విషయం" అని వెల్లడించారు. ప్ర‌ధాని మోదీతో తన స్నేహం గురించి చెబుతూ, "ఆయన గొప్ప వ్యక్తి. ఇన్నేళ్లలో నాకు మంచి మిత్రుడయ్యారు" అని అన్నారు.

దీపావళి పండుగ ప్రాముఖ్యతను ట్రంప్ ప్రత్యేకంగా వివరించారు. "చీకటిపై వెలుగు, అజ్ఞానంపై జ్ఞానం, చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా మనం ఈ దీపాన్ని వెలిగిస్తాం. శత్రువులను ఓడించి, అడ్డంకులను తొలగించి, బంధీలకు విముక్తి కల్పించిన పురాతన గాథలను ఈ పండుగ గుర్తు చేస్తుంది" అని తెలిపారు. దీపపు జ్వాల మనకు వివేక మార్గాన్ని చూపుతుందని, కష్టపడి పనిచేయాలని, దేవుడి ఆశీస్సులకు కృతజ్ఞతలు చెప్పాలని గుర్తు చేస్తుందని ఆయన పేర్కొన్నారు.

ఈ వేడుకల్లో ట్రంప్ ప్రభుత్వంలోని పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వీరిలో ఎఫ్‌బీఐ డైరెక్టర్ కశ్ పటేల్, ఓడీఎన్ఐ డైరెక్టర్ తులసి గబార్డ్, వైట్‌హౌస్ డిప్యూటీ ప్రెస్ సెక్రటరీ కుష్ దేశాయ్, అమెరికాలో భారత రాయబారి వినయ్ మోహన్ క్వాత్రా, భారత్‌లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ తదితరులు ఉన్నారు. ప్రముఖ భారత-అమెరికన్ వ్యాపారవేత్తలు కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. ఈ వేడుకలు అమెరికా-భారత్ మధ్య బలమైన సాంస్కృతిక సంబంధాలకు నిదర్శనంగా నిలిచాయి.

Tags:    

Similar News