Trump: వివేక్ రామస్వామిపై ట్రంప్ ప్రశంసలు.. గవర్నర్ ఎన్నికల్లో మద్దతు
ఒహియో గవర్నర్ ఎన్నికల్లో ట్రంప్ మద్దతు
ఇండియన్-అమెరికన్ వివేక్ రామస్వామిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రశంసలు వర్షం కురిపించారు. వివేక్ తనకు బాగా తెలుసని.. చాలా ప్రత్యేకమైన వ్యక్తి అంటూ కొనిడాయారు. వివేక్ రామస్వామి ఒహియో గవర్నర్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ట్రంప్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ‘‘వివేక్ యువకుడు, బలమైనవాడు, తెలివైనవాడు. చాలా మంచి వ్యక్తి. దేశాన్ని నిజంగా ప్రేమించే వ్యక్తి. ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేయడానికి, పన్నులు, నిబంధనలను తగ్గించడానికి, మేడ్ ఇన్ ది యూఎస్ఎను ప్రోత్సహించడానికి. ఛాంపియన్ అమెరికన్ ఎనర్జీ డామినెన్స్‌ను ప్రోత్సహించడానికి. సురక్షితమైన సరిహద్దులను కాపాడటానికి.. భద్రంగా, వలస నేరాలను అరికట్టడానికి. మన సైనిక, అనుభవజ్ఞులను బలోపేతం చేయడానికి అవిశ్రాంతంగా పోరాడుతారు.’’ అంటూ ట్రంప్ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు.
‘‘వివేక్ రామస్వామి ఒహియోకు గొప్ప గవర్నర్ అవుతారు. నా పూర్తి ఆమోదం ఉంది. మిమ్మల్ని ఎప్పటికీ నిరాశపరచడు!, 2016, 2020, 2024ల్లో నేను కూడా పెద్ద విజయం సాధించాను’’ అంటూ ట్రంప్ తెలిపారు.
వివేక్ గురించి ..
ఒహియో.. అమెరికా మధ్యపశ్చిమ ప్రాంతంలో ఉన్న ఒక రాష్ట్రం. ఇక్కడే వివేక్ రామస్వామి జన్మించారు. కేరళకు చెందిన తల్లిదండ్రులు అమెరికాకు వలస వెళ్లారు. హార్వర్డ్ నుంచి బయోలజీలో వివేక్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 2024 ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్షుడి రేసులో ట్రంప్‌తో వివేక్ పోటీ పడ్డారు. అనంతరం పోటీని విరమించుకున్నారు. అటు తర్వాత ట్రంప్ విజయం కోసం కృషి చేశారు. ఇక 2014లో రోయివెంట్ సైన్సెస్ అనే బయోటెక్ ఫార్మా కంపెనీని స్థాపించారు. 2021 వరకు సీఈవోగా ఉన్నారు.