ఆందోళన చెందడం లేదు.. ఆత్మవిశ్వాసంతోనే వెళ్తున్నా.. : ట్రంప్
చివరిసారిగా ఎయిర్ ఫోర్స్ వన్ విమానం ఎక్కి ఫ్లోరిడాలోని పామ్ బీచ్ సమీపంలో తన మార్ లాగో రిసార్టుకు వెళ్లారు ట్రంప్.;
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్‌హౌస్‌ను వీడారు. తన సతీమణి మెలానియాతో కలిసి ఆయన వైట్‌హౌస్ నుంచి బయటకు వైదొలిగారు. బైడన్ ప్రమాణానికి హాజరుకాకూడదని నిర్ణయించుకున్న ట్రంప్.. బైడన్ ప్రమాణ స్వీకారానికి ముందే ట్రంప్ వైట్‌హౌస్ ఖాళీ చేయడం విశేషం. వైట్‌హౌస్ నుంచి వారు నేరుగా మేరీల్యాండ్‌లోని మిలిటరీ ఎయిర్‌బేస్‌కు బయలుదేరారు. చివరిసారిగా ఎయిర్ ఫోర్స్ వన్ విమానం ఎక్కి ఫ్లోరిడాలోని పామ్ బీచ్ సమీపంలో తన మార్ లాగో రిసార్టుకు వెళ్లారు.
వైట్ హౌస్‌ను వీడేముందు డొనాల్డ్ ట్రంప్ చివరిసారి ప్రసంగించారు.. నా ఈ ప్రయాణంలో సహకరించిన అందరికీ కృతజ్ఞతలు అంటూ ప్రసంగాన్ని ప్రారంభించిన ట్రంప్.. అనేక విషయాలను వెల్లడించారు.. తానేం ఆందోళన చెందడం లేదని.. ఆత్మవిశ్వాసంతోనే వెళ్తున్నానని అన్నారు.
ట్రంప్ అధ్యక్షుడిగా చివరి రోజున శ్వేత సౌధం మాజీ ఉన్నతాధికారి స్టీవ్ బ్యానన్ సహా 73 మందికి క్షమాభిక్ష ప్రకటించారు. మరో 70 మందికి శిక్షను కుదిస్తూ నిర్ణయం తీసుకున్నారు. సంక్షుభిత రాజకీయ పరిణామాల మధ్య నవంబరులో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిని తుదిదాకా అంగీకరించలేదు. చివరికి దేశ ప్రజాస్వామ్యసౌధంపైనే దాడికి అనుచరులను పురిగొల్పి- రెండుసార్లు అభిశంసనను మూటగట్టుకున్నారు.