White House: ర‌ష్యాపై వ‌త్తిడి తెచ్చేందుకే ఇండియాపై టారిఫ్ మోత: వైట్‌హౌజ్‌

యుద్ధాన్ని త్వరగా ముగించాలన్నదే ట్రంప్ లక్ష్యమని వెల్లడి;

Update: 2025-08-20 06:15 GMT

ఉక్రెయిన్‌తో యుద్ధం చేస్తున్న రష్యాను నిలువరించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. భారత్‌పై భారీ సుంకాలను విధించినట్టు వైట్ హౌస్ వెల్లడించింది. రష్యాపై పరోక్షంగా ఒత్తిడి పెంచే వ్యూహంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. ఈ చర్య ద్వారా మాస్కోను దౌత్యపరంగా కట్టడి చేయాలన్నది ట్రంప్ యంత్రాంగం ఆలోచనగా తెలుస్తోంది.

మంగళవారం వైట్ హౌస్‌లో జరిగిన మీడియా సమావేశంలో ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ ఈ వివరాలను తెలిపారు. ఇప్పటికే ఉన్న 25 శాతం సుంకానికి అదనంగా మరో 25 శాతం కలిపి, భారత్‌పై మొత్తం టారిఫ్‌ను 50 శాతానికి ట్రంప్ పెంచారని ఆమె పేర్కొన్నారు. "యుద్ధాన్ని ముగించేందుకు అధ్యక్షుడు ట్రంప్ తీవ్రమైన ఒత్తిడి తెస్తున్నారు. అందులో భాగంగానే భారత్‌పై ఆంక్షలు వంటి చర్యలు తీసుకుంటున్నారు" అని లెవిట్ వివరించారు.

యుద్ధాన్ని వీలైనంత త్వరగా ముగించాలన్నదే ట్రంప్ ఉద్దేశమని ఆమె అన్నారు. ఇటీవలే ట్రంప్.. ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీతో వైట్ హౌస్‌లో సమావేశమయ్యారని గుర్తుచేశారు. అవసరమైతే రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో కలిసి త్రైపాక్షిక సమావేశానికి కూడా ట్రంప్ సిద్ధంగా ఉన్నారని సంకేతాలిచ్చారు. ట్రంప్ శాంతి ప్రయత్నాలకు యూరోపియన్ దేశాల నుంచి మంచి స్పందన వస్తోందని లెవిట్ తెలిపారు. పుతిన్‌తో ట్రంప్ సమావేశమైన 48 గంటల్లోనే యూరోపియన్ నేతలందరూ అమెరికాకు వచ్చి ఆయన్ను కలవడం దీనికి నిదర్శనమని చెప్పారు.

ఒకవేళ ట్రంప్ అధ్యక్షుడిగా ఉండుంటే ఈ యుద్ధం మొదలయ్యేదే కాదని పుతిన్ అన్న మాట వాస్తవమేనా? అని విలేకరులు ప్రశ్నించగా.. "అది నిజమే. ఆ విషయాన్ని పుతిన్ స్వయంగా చెప్పారు" అని లెవిట్ సమాధానమిచ్చారు. శాశ్వత శాంతి స్థాపనే లక్ష్యంగా ట్రంప్ మిత్రపక్షాలు, నాటో దేశాలతో చర్చిస్తున్నారని, ఈ యుద్ధాన్ని ముగించేందుకు ఆయన ఎంతో సమయం, శక్తిని వెచ్చిస్తున్నారని లెవిట్ తెలిపారు.

Tags:    

Similar News