Donald Trump: 50 రోజుల్లో ఉక్రెయిన్‌తో కాల్పుల విరమణ ఒప్పందానికి రావాలి..లేదంటే ట్రంప్ తీవ్ర హెచ్చరికలు
లేదంటే రష్యాపై తీవ్రమైన సుంకాలు ..;
రాబోయే 50 రోజుల్లో ఉక్రెయిన్‌తో కాల్పుల విరమణకు వ్లాదిమిర్ పుతిన్ అంగీకరించకపోతే రష్యాపై “తీవ్రమైన సుంకాలు” విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం వార్నింగ్ ఇచ్చారు. ‘‘మేము సెకండరీ టారిఫ్‌లు అమలు చేయబోతున్నాం. 50 రోజుల్లో ఒప్పందం కుదరకపోతే, అవి 100 శాతం ఉంటాయి.’’ అని సోమవారం వైట్‌హౌజ్‌లో విలేకరులతో ట్రంప్ అన్నారు. ఉక్రెయిన్ యుద్ధాన్ని పుతిన్ ఆపకపోవడంపై ట్రంప్ చాలా సార్లు అసంతృప్తి వ్యక్తం చేశారు.
శాంతిని కోరుకుంటున్నానని చెప్పి, వెంటనే ఉక్రెయిన్‌పై దాడుల్ని చేస్తుండటంతో రష్యాపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రష్యాపై ట్రంప్‌కు అసహనం పెరుగుతుండటంతో కొత్త ఆంక్షలు విధించే అవకాశం ఉందని తెలుస్తోంది. అంతకుముందు…‘‘ ప్రెసిడెంట్ పుతిన్ పట్ల నేను చాలా నిరాశ చెందాను. చాలా చక్కగా మాట్లాడుతాడు, ఆ తర్వాత రాత్రిపూట ప్రజలపై బాంబులు వేస్తాడు, ఇది నాకు ఇష్టం లేదు’’ అని ట్రంప్ అన్నారు. రష్యాపై ఉక్రెయిన్ యుద్ధంలో మద్దతు ఇవ్వడానికి అమెరికా నాటోకు పంపే ఆయుధాలలో పేట్రియాట్ క్షిపణి వ్యవస్థలు, బ్యాటరీలు ఉంటాయని కూడా ట్రంప్ అన్నారు.