Trupm-Putin: ట్రంప్‌తో భేటీకానున్న రష్యా ప్రెసిడెంట్ పుతిన్..
జెలెన్‌స్కీ కూడా హాజరయ్యే ఛాన్స్;
అమెరికా అధ్యక్షుడు ట్రంప్-రష్యా అధ్యక్షుడు పుతిన్ వచ్చే వారం ప్రత్యక్షంగా కలవబోతున్నట్లు నివేదికలు అందుతున్నాయి. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం ఆపేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. కానీ పుతిన్ అందుకు ససేమిరా అంటున్నారు. దీంతో ట్రంప్ స్వయంగా రంగంలోకి దిగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఉక్రెయిన్‌తో వివాదానికి ముగింపు పలికేందుకు పుతిన్-జెలెన్‌స్కీ ఇద్దరితోనూ శిఖరాగ్ర సమావేశానికి ట్రంప్ సిద్ధపడ్డారు. వచ్చే వారం ప్రారంభంలోనే ఈ సమావేశం ఉంటుందని వైట్ హౌస్ తెలిపింది.
ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణకు చర్చలు జరిపేందుకు స్వయంగా ట్రంప్ రంగంలోకి దిగుతున్నారు. పుతిన్‌తో నేరుగానే చర్చలు జరపనున్నట్లు సమాచారం. వైట్ హౌస్ అధికారి ప్రకారం.. ఈ సమావేశం వచ్చే వారం ప్రారంభంలోనే జరగవచ్చని.. ఉక్రెయిన్-రష్యా యుద్ధం ముగింపునకు పరిష్కారం దొరకవచ్చని అభిప్రాయపడ్డారు. మాస్కో ముఖాముఖి సమావేశాన్ని ప్రతిపాదించిందని.. అందుకు అధ్యక్షుడు ట్రంప్ అంగీకరించారని వైట్ హౌస్ స్పష్టం చేసింది. ఇక పుతిన్-జెలెన్‌స్కీని కలవడానికి ట్రంప్ సిద్ధంగా ఉన్నట్లు వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ తెలిపారు.
ఉక్రెయిన్‌కు చెందిన ఒక సీనియర్ అధికారి మాట్లాడుతూ.. ట్రంప్-జెలెన్‌స్కీ ఫోన్ కాల్‌లో ప్రత్యక్ష చర్చల గురించి చర్చించారని.. ఈ ఫోన్ కాల్‌లో నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే, యూకే, జర్మనీ, ఫిన్లాండ్ నాయకులు కూడా పాల్గొన్నారని వెల్లడించారు.
ట్రంప్-పుతిన్ మధ్య సమావేశం జరిగితే.. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక కలవడం ఇదే తొలిసారి అవుతుంది. ఇక ట్రంప్-జెలెన్‌స్కీ ఇప్పటికే అనేక మార్లు కలిశారు. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో వైట్‌హౌస్‌లో ట్రంప్‌తో జెలెన్‌స్కీ సమావేశం అయ్యారు. ఇది వివాదాస్పదమైంది.