Elon Musk: జర్నలిస్టులకు మస్క్ బంపర్ ఆఫర్
రోజుకో కొత్త నిర్ణయంతో దూసుకుపోతున్న మస్క్.... బిట్‌కాయిన్ పెట్టుబడుల అమ్మకం... ఎక్స్ ప్లాట్‌ఫామ్‌లో జాబ్ ఓపెనింగ్స్;
దిగ్గజ పారిశ్రామికవేత్త ఎలాన్ మస్క్ (Elon Musk) ట్విట్టర్‌ను ఎక్స్ (X) ప్లాట్‌ఫామ్‌గా ఇప్పటికే మార్చేశారు. ఇక ఎక్స్‌ను ఎవ్రీథింగ్ యాప్ (Everything app)గా మార్చాలని మస్క్ సరికొత్త ఫీచర్లను పరిచయం చేస్తున్నారు. మస్క్ ఇప్పుడు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. మ స్క్ జర్నలిస్ట్‌లకు ఓ బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఎక్స్ సామాజిక మాధ్యమంలో జర్నలిస్ట్‌లు నేరుగా తమ ఆర్టికల్స్( news articles) ప్రచురిస్తే అధిక ఆదాయం పొందటంతోపాటు పూర్తి స్వేచ్ఛ ఉంటుందని ట్వీట్ చేశారు. గతంలో మీడియా పబ్లిషర్స్( organisations) కు కూడా ఇలాంటి ప్రతిపాదనే చేశారు. ఎక్స్ సామాజిక మాధ్యమంలో ఆర్టికల్స్ పబ్లిష్ చేసి వాటిని చదివిన యూజర్స్ నుంచి ఛార్జీలు వసూలు చేయాలని పబ్లిషర్స్ కు సూచించారు.
ఆర్టికల్స్ ఆధారంగా యూజర్ ఛార్జీలు వసూలు చేయాలన్న మస్క్ నెలవారీగా సబ్ స్క్రిప్షన్ తీసుకోకుంటే అధికమొత్తం ఛార్జ్ చేయాలని పేర్కొన్నారు. ఇలాంటి వాటికి సంబంధించి ఇంకా ఓ విధానం లేదు. అయితే ఫ్రాన్స్ లో ఎక్స్ పై కాపీ రైట్స్ కేసు దాఖలైంది. న్యాయపరమైన పరిహారాన్ని అంచనా వేసేందుకు అవసరమైన డేటా ఎక్స్ నుంచి ఇప్పించాలని కోరుతూ అంతర్జాతీయ వార్తా సంస్థ కాపీరైట్స్ కేసు వేసింది. మరోవైపు వెరిఫైడ్ ఆర్గనైజేషన్స్ జాబ్స్ ఓపెనింగ్స్‌ను వారి ప్రొఫైల్ పేజీలో లిస్ట్ చేసుకునే సదుపాయం కూడా ఎక్స్ ప్లాట్‌ఫామ్‌లో అందిస్తామని ప్రకటించారు.
అమెరికా స్పేస్ రాకెట్ల తయారీ సంస్థ స్పేస్‌ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. 2021 నుంచి 2022 మధ్య కాలంలో బిట్ కాయిన్‌లలో పెట్టిన పెట్టుబడుల మొత్తాన్ని అమ్మినట్లు తెలుస్తోంది. ఆ మొత్తం విలువ 373 మిలియన్ డాలర్లుగా ఉందని పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.
మరోవైపు మస్క్ తీసుకున్న మరో నిర్ణయంతో బిట్‌కాయిన్ మార్కెట్ భారీగా కుప్పకూలింది. స్పేస్‌ఎక్స్ బిట్‌కాయిన్ పెట్టుబడుల్ని అమ్మిన కేవలం అరగంట వ్యవధిలో బిట్‌కాయిన్ మార్కెట్ క్రాష్ అయ్యింది. 800 మిలియన్ డాలర్ల మేర నష్టం వాటిల్లింది. స్పేస్‌ఎక్స్ తన బిట్‌కాయిన్‌లోని ఇన్వెస్ట్‌మెంట్‌లను అమ్మడం బిట్ కాయిన్ మార్కెట్‌లో అలజడి సృష్టించింది. కేవలం రెండు నెలల్లో తొలిసారి 26 వేల డాలర్ల తక్కువకు పడిపోయింది. మొదటి త్రైమాసికంలో 72 శాతం పెరుగుదల తర్వాత మార్చి నెల చివరి నుంచి బిట్‌కాయిన్ 9 శాతం క్షీణించింది.