Ukraine: రష్యా ఎస్‌యూ-30 ఫైటర్ జెట్‌ను కూల్చిన ఉక్రెయిన్
ఇప్పటి వరకు అధికారికంగా స్పందించని రష్యా;
రష్యాతో జరుగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్ సంచలనం సృష్టించింది. రష్యాకు చెందిన సుఖోయ్-30 (ఎస్‌యూ-30) యుద్ధ విమానాన్ని తమ సముద్ర ఆధారిత మానవ రహిత నౌక (డ్రోన్) నుంచి ప్రయోగించిన క్షిపణితో కూల్చివేసినట్టు ఉక్రెయిన్ సైనిక గూఢచార సంస్థ (జీయూఆర్) సంచలన ప్రకటన చేసింది. ప్రపంచ యుద్ధ చరిత్రలో సముద్ర డ్రోన్ సహాయంతో మానవ సహిత యుద్ధ విమానాన్ని కూల్చివేయడం ఇదే తొలిసారని కీవ్ వర్గాలు పేర్కొన్నాయి.
జీయూఆర్ కథనం ప్రకారం.. ఈ ఆపరేషన్‌ను వారి ప్రత్యేక విభాగం 'గ్రూప్ 13' శుక్రవారం నల్ల సముద్రంలో విజయవంతంగా నిర్వహించింది. రష్యాకు చెందిన ప్రధాన ఓడరేవు నగరం నోవోరోసిస్క్‌కు పశ్చిమాన సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇటీవల ఉక్రెయిన్ ఎక్కువగా ఉపయోగిస్తున్న 'మగురా వీ5' రకం సముద్ర డ్రోన్‌పై అమర్చిన క్షిపణి ద్వారా ఈ దాడి చేసినట్టు జీయూఆర్ వివరించింది. ఈ ప్రకటనతో పాటు ఉక్రెయిన్ అధికారులు ఒక వీడియోను కూడా విడుదల చేశారు, అయితే ఆ ఫుటేజ్ ప్రామాణికత ఇంకా స్వతంత్రంగా ధ్రువీకరించలేదు.
కూలిన విమానం విలువ 50 మిలియన్ డాలర్లు
ఉక్రెయిన్ భద్రతా సేవ (ఎస్బీయూ), ఇతర సాయుధ దళాల విభాగాలతో సమన్వయం చేసుకుని ఈ ఆపరేషన్ చేపట్టినట్లు జీయూఆర్ తెలిపింది. కూల్చివేసిన విమానం రష్యాకు చెందిన ఎస్‌యూ-30 రకం అని, దీని విలువ సుమారు 50 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 415 కోట్లు) ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ విమానం ‘గాలిలోనే మంటల్లో చిక్కుకుని సముద్రంలో కూలిపోయింది’ అని ఉక్రెయిన్ వర్గాలు పేర్కొన్నాయి.
నోవోరోసిస్క్ నగరంలో అత్యవసర స్థితి
ఈ సంఘటనపై రష్యా రక్షణ మంత్రిత్వశాఖ నుంచి ఇప్పటివరకు ఎటువంటి అధికారిక స్పందన వెలువడలేదు. అయితే, ఈ ప్రకటన వెలువడటానికి ముందు నోవోరోసిస్క్ నగరంపై ఉక్రెయిన్ డ్రోన్ దాడి జరిగిందని, ఒక ధాన్యం టెర్మినల్, కొన్ని నివాస భవనాలు దెబ్బతిన్నాయని నగర మేయర్ ప్రకటించారు. ఈ దాడిలో ఐదుగురు గాయపడినట్టు స్థానిక అధికారులు తెలిపారు. నగరంలో అత్యవసర పరిస్థితి విధించారు.
రష్యా ప్రతీకార దాడులు
మరోవైపు, ఉక్రెయిన్ ఈ ప్రకటన చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే రష్యా బలగాలు ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై డ్రోన్లతో ప్రతీకార దాడికి దిగాయి. రష్యా డ్రోన్లను ఉక్రెయిన్ గగనతల రక్షణ వ్యవస్థలు అడ్డగించినప్పటికీ, వాటి శకలాలు నగరంపై పడటంతో కనీసం రెండు జిల్లాల్లో నష్టం వాటిల్లింది. కొన్ని నివాస భవనాలు, పార్క్ చేసిన వాహనాల్లో మంటలు చెలరేగినట్లు అధికారులు వెల్లడించారు.