Ukrain : కెర్చ్ వంతెన పై దాడి చేసింది మేమే
తొలిసారి బహిరంగ ప్రకటన చేసిన ఉక్రెయిన్;
రష్యా క్రీమియాను కలిపే కెర్చ్ వంతెన పై గత ఏడాది భారీ పేలుడు జరిగింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ కలల వంతెనగా చెప్పుకునే ఆ వంతెనలో కొంత భాగం కూలిపోయింది. అయితే అప్పట్లో దాడి చేసింది తామేనని మొట్టమొదటిసారిగా ఉక్రెయిన్ అంగీకరించింది. ఉక్రెయిన్ నిఘా సంస్థ చీఫ్ ఈ పేలుడు దాడి గురించి స్పందించారు. స్థానిక మీడియాతో మాట్లాడిన ఆయన తాము చేసిన ఎన్నో ఆపరేషన్లలో విజయవంతమైనవే మాత్రమే బయటకు చెప్పగలమన్నారు. గత ఏడాది అక్టోబర్ 8వ తేదీన క్రిమిన వంతెనపై జరిపిన దాడి అలాంటి వాటిలో ఒకటిగా అభివర్ణించారు.
క్రిమియా ద్వీపకల్పాన్ని.. రష్యా ప్రధాన భూభాగంతో కలిపేది కెర్చ్ వంతెన. క్రిమియాకు నిత్యావసరాల సరఫరాలోనూ , యుద్ధ రంగంలోని రష్యా బలగాలకు ఆయుధాలను చేరవేయడంలో 19 కి.మీ. పొడవైన ఈ కెర్చ్ వంతెన ఎంతో కీలకం., వాహనాలు, రైళ్ల రాకపోకల కోసం నిర్మించిన ఈ బ్రిడ్జ్ ఐరోపాలోనే అత్యంత పొడవైనది. గత కొంత కాలంగా నల్ల సముద్రంపై ఆధిపత్యం కోసం తీవ్రంగా యత్నిస్తున్న రష్యా.. 2014లో క్రిమియా ద్వీపాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత సుమారు రూ.29వేల కోట్లు అంటే 360 కోట్ల అమెరికన్ డాలర్లు ఖర్చుపెట్టి ఈ రోడ్డు, రైలు వంతెనను నిర్మించింది. 2018లో రష్యా అధ్యక్షుడు పుతిన్ స్వయంగా ట్రక్ నడిపి కెర్చ్ వంతెనను ప్రారంభించారు. అందుకే దీనిని పుతిన్ డ్రీం బ్రిడ్జ్ గా చెప్పచ్చు. అయితే 2022 అక్టోబర్‌లో సరిగ్గా పుతిన్ 70వ జన్మదిన వేడుకలు జరిగిన మరుసటి రోజే కెర్చ్ బ్రిడ్జిపై దాడి జరిగింది.
ఆ బాంబు పేలుడులో సమీపంలోని రైలు వంతెన పై చమరు ట్యాంకర్లు మంటల్లో చిక్కుకున్నాయి. దాడి తీవ్రతకు వంతెన కొంత భాగం కూలిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందినట్లు అప్పట్లో అధికారులు వెల్లడించారు.
అప్పట్లో ఉక్రెయిన్ అత్యాధునిక సముద్ర డ్రోన్‌లో పేలుడు పదార్థాలు నింపి ఈ వంతెన కింద పేల్చినట్లు సమాచారం. కొన్ని మైళ్ల దూరం నుంచి సెన్సర్లు, రిమోట్ సాయంతో ఆ దాడి చేసినట్లు భావిస్తున్నారు. ఇంత కాలం తరువాత ఉక్రెయిన్ బహిరంగంగా తను చేసిన దాడిని ప్రకటించుకుంది.