Russia-Ukraine war: రష్యా-ఉక్రెయిన్ మధ్య మొదలైన శాంతి చర్చలు
ట్రంప్-పుతిన్ భేటీకి ఖరారుకాని ముహూర్తం;
ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు రష్యాతో అమెరికా చర్చలు మంగళవారం మొదలయ్యాయి. సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని దిర్హియా ప్యాలెస్ దీనికి వేదికైంది. ఉక్రెయిన్ భాగస్వామ్యం లేకుండా ఆ రెండు దేశాల విదేశాంగ మంత్రులు తొలివిడత సమాలోచనలు జరిపారు. ఒక ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటుకు నిర్ణయించారు. అమెరికా, రష్యా విదేశాంగ మంత్రులు మార్కో రుబియో, సెర్గీ లవ్రోవ్ దీనిలో పాల్గొన్నారు. యుద్ధానికి ఎలా ముగింపు పలకాలన్నది వీరిమధ్య ప్రధానంగా చర్చకు వచ్చింది. దీంతోపాటు అమెరికా-రష్యా మధ్య ఆర్థిక లావాదేవీలు సహా అన్నింటా సత్సంబంధాలపై సమాలోచనలు జరిగాయి. ఇరుదేశాల మధ్య ఇలాంటి సమావేశం మూడేళ్ల తర్వాత ఇదే తొలిసారి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య భేటీ తేదీ ఈ సమావేశంలో ఖరారు కాలేదు. ఇది చర్చల ప్రారంభం కాదని, యుద్ధం ముగింపునకు రష్యా నిజంగా సిద్ధంగా ఉందో లేదో తెలుసుకోవడానికని అమెరికా ప్రతినిధి పేర్కొన్నారు. దాని ఆధారంగా సమగ్ర చర్చలు ఉంటాయని చెప్పారు.
2022లో రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం మొదలైంది. ఈ యుద్ధంలో ఉక్రెయిన్ భారీగా దెబ్బతింది. వందలాది మంది ఉక్రెయిన్ ప్రజలు చనిపోయారు. భారీగా ఆస్తులు ధ్వంసం అయ్యాయి. అయితే జో బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు.. ఉక్రెయిన్‌కు యుద్ధంలో సహకరించారు. దీంతో రష్యాపై కూడా ప్రతీకార దాడులు చేశారు. అయితే ప్రస్తుతం ట్రంప్ అధ్యక్ష పీఠంపై కూర్చున్నాక పరిస్థితులు మారాయి. యుద్ధానికి ముగింపు పలకాలని ఉక్రెయిన్ అధ్యక్షుడికి ట్రంప్ సూచించారు. అలాగే పుతిన్‌ను కూడా ట్రంప్ ఒప్పించారు. ఇన్నాళ్లకు ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు మొదలయ్యాయి. ఎలాంటి ఫలితం వస్తుందో చూడాలి.