H-1B visas: లాటరీ ప్రక్రియ ప్రక్షాళన కోసం అమెరికా కొత్త నిబంధనలు

హెచ్‌-1బీ రెన్యువల్‌ అమెరికాలోనే! భారతీయులు, కెనడియన్లకు ఫస్ట్‌ చాన్స్‌;

Update: 2024-02-01 06:45 GMT

 2025 ఆర్థిక సంవత్సరానికి జారీచేసే హెచ్‌-1బీ వీసాల లాటరీ ప్రక్రియను ప్రక్షాళన చేసేందుకు  అమెరికా కీలక నిర్ణయం తీసుకున్నది. కొత్త నిబంధనలు ప్రకటించింది. దీంతో ఇకపై వీసా కోసం ఎవరు ఎన్ని దరఖాస్తులు చేసుకున్నా ఒకే దరఖాస్తుగా పరిగణిస్తారు. ఒకే వ్యక్తి తరఫున అనేక దరఖాస్తులు సమర్పించి లాటరీ విధానంలో ప్రయోజనం పొందేందుకు పలు కంపెనీలు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఈ నిబంధనను ప్రవేశపెట్టారు.

పిటిషన్ల సంఖ్యతో నిమిత్తం లేకుండా దరఖాస్తుదారులందరికీ సమాన అవకాశాలు కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అమెరికా పౌరసత్వ, వలస సేవల విభాగం (యూఎస్‌సీఐఎస్‌) వెల్లడించింది. కొత్త నిబంధనల ప్రకారం ప్రతి దరఖాస్తుదారుడు సరైన పాస్‌పోర్టు వివరాలు, ప్రయాణ పత్రాలను విధిగా సమర్పించాల్సి ఉంటుందని, తప్పుడు సమాచారం ఉన్న దరఖాస్తులను తిరస్కరించే అధికారం యూఎస్‌సీఐఎస్‌కి ఉంటుందని స్పష్టం చేసింది. 2025 వీసాల తొలి రిజిస్ట్రేషన్‌ మార్చి 6 నుంచి 22 వరకు కొనసాగుతుందని తెలిపింది. . రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ నుంచి వీసా మంజూరు వరకు అన్నీ ఎలక్ర్టానిక్‌ విధానంలో జరుగుతాయని యూఎ్‌ససీఐఎస్‌ వివరించింది. దరఖాస్తు దారులు ఖచ్చితంగా యూఎ్‌ససీఐఎస్‌ ఆన్‌లైన్‌ అకౌంట్‌లో రిజిస్టర్‌ చేసుకుని.. తర్వాత ప్రక్రియ ప్రారంభించాలని, చెల్లింపులు కూడా దాని నుంచే చేయాలని సూచించింది. కంపెనీలకు సంబంధించి మాత్రం రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను ఫిబ్రవరి 28నే ప్రారంభించనున్నట్టు తెలిపింది. వీసాల జారీ ప్రక్రియ అక్టోబరు 1 నుంచి ప్రారంభమవుతుందని పేర్కొంది. 

అలాగే హెచ్‌-1బీ వీసా రెన్యువల్‌ విధానాన్ని మరింత సరళీకరిస్తూ అమెరికా తీసుకొన్న ఓ నిర్ణయం అమల్లోకి వచ్చింది. దీంతో భారత్‌ సహా ఇతర దేశాలకు చెందిన వృత్తి నిపుణులు ఇకపై అమెరికాలో తమ గడువు తీరిన వీసాలను అక్కడే రెన్యువల్‌ చేసుకోవచ్చు. పైలట్‌ ప్రాజెక్టులో భాగంగా 20 వేల వీసాలను అమెరికాలోనే రెన్యువల్‌ చేయనున్నారు. 

తొలి దశ డ్రైవ్‌లో ఈ అవకాశాన్ని కేవలం భారతీయులు, కెనడియన్లకు మాత్రమే కల్పించారు. ఐదు వారాలు కొనసాగే ఈ వీసా రెన్యువల్‌ కార్యక్రమంలో ప్రతి వారం 4 వేలు చొప్పున వీసాలను ఇమ్మిగ్రేషన్‌ అధికారులు రెన్యువల్‌ చేయనున్నారు. 2021, ఫిబ్రవరి 1 నుంచి 2021, సెప్టెంబర్‌ 30 మధ్య మిషన్‌ ఇండియా జారీ చేసిన వీసాలను మాత్రమే రెన్యువల్‌ చేసుకొనేందుకు వీలు కల్పించారు. 

 

 

Tags:    

Similar News