అమెరికా ఎన్నికలు : ఓట్ల లెక్కింపు ఆలస్యానికి కారణం ఇదే!
కౌంటింగ్ మొదలై రెండు రోజులు గడిచాయి. అయినా అదే అనిశ్చితి. అదే సందిగ్ధం.! అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే 45 రాష్ట్రాల్లో కౌంటింగ్..;
కౌంటింగ్ మొదలై రెండు రోజులు గడిచాయి. అయినా అదే అనిశ్చితి. అదే సందిగ్ధం.! అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే 45 రాష్ట్రాల్లో కౌంటింగ్ పూర్తయింది. ఇక అసలు సమస్యంతా మిగిలిన ఆ ఐదు రాష్ట్రాల్లోనే ఉంది. అమెరికన్ ప్రెసిడెంట్ ను డిసైడ్ చేయనునున్న ఈ ఐదు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు అత్యంత సుదీర్ఘంగా సాగుతోంది. భారీగా పోలైన పోస్టల్ బ్యాలెట్స్ ఆలస్యానికి కారణం అవుతున్నాయి...డెమొక్రాట్ అభ్యర్థి జో బైడెన్ 264 ఎలక్టోరల్ ఓట్లతో ముందంజలో ఉన్నారు. రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ 214 ఎలక్టోరల్ ఓట్లు సాధించారు. మేజిక్ ఫిగర్ 270 సాధించిన వారే అధ్యక్షుడు కానున్నారు. ఈ క్రమంలో కీలకమైన పెన్సిల్వేనియా, నెవాడా, నార్త్ కరోలినా, జార్జియా, అలస్కా రాష్ట్రాల్లో ఫలితాలు వెలువడాల్సి ఉంది.
మొత్తం 20 ఎలక్టోరల్ ఓట్లు ఉన్న పెన్సిల్వేనియా రాష్ట్రంలో ఇప్పటి వరకు 89 శాతం ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ కాస్త ముందంజలో ఉన్నారు..గతంలో ఈ రాష్ట్రంలో ట్రంపే గెలుపొందారు. ఇక్కడ ఓట్ల లెక్కింపునకు మరింత సమయం పట్టే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. మొత్తం 10 లక్షల మెయిల్- ఇన్ ఓట్లను లెక్కించాలి. ఇక్కడ మెయిల్-ఇన్ ఓట్లు ఎక్కువగా డెమొక్రాట్లకే పడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే పెన్సిల్వేనియా ఓట్ల లెక్కింపుపై మూడు పిటిషన్లు దాఖలయ్యాయి. ఇక ఫలితాలు రావాల్సిన మరో రాష్ట్రం జార్జియా. గతంలో ట్రంప్ గెలుపొందిన రాష్ట్రమిది. ఇక్కడ 16 ఎలక్టోరల్ ఓట్లు ఉన్నాయి. ఇప్పటి వరకు 99 శాతం ఓట్ల లెక్కింపు జరిగింది. ఇక్కడ కూడా ట్రంప్ ముందంజలో ఉన్నారు..త్వరలోనే ఈ ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
15 ఎలక్టోరల్ ఓట్లు ఉన్న నార్త్ కరోలినాలో కూడా గతంలో ట్రంపే గెలుపొందారు. ఇప్పటి వరకు 94 శాతం ఓట్ల లెక్కింపు చేపట్టగా.. 50.1 శాతం ఓట్లతో ట్రంప్ ముందంజలో ఉన్నారు. బైడెన్‌కు 48.7 శాతం ఓట్లు వచ్చాయి. ఎన్నికల తేదీ రోజున వేసిన పోస్టల్ బ్యాలెట్ ఓట్లు చేరడానికి ఇక్కడ నవంబర్ 12 వరకు అనుమతిస్తున్నారు. దీంతో నవంబర్ 13 వరకు తుది ఫలితాలు వెల్లడయ్యే అవకాశం కనిపించడం లేదు.
ఇక మొత్తం 6 ఎలక్టోరల్ ఓట్లు ఉన్న నెవడాలో గతంలో హిల్లరీ క్లింటన్ గెలుపొందారు. ఇప్పటి వరకు 76 శాతం ఓట్లు మాత్రమే లెక్కించారు. బైడెన్ 49.3 శాతం ఓట్లతో ముందంజలో ఉన్నారు. ట్రంప్‌కు 48.7 శాతం ఓట్లు వచ్చాయి. ఎన్నికల తేదీ రోజు వేసిన పోస్టల్ బ్యాలెట్లను ఇక్కడ నవంబర్ 10వ తేదీ వరకు అనుమతించనున్నారు. దీంతో ఇక్కడా కూడా ఫలితం మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.