US Tariffs: నేటి నుంచి 50% సుంకాల భారం
48 బిలియన్ డాలర్ల వాణిజ్యంపై ప్రభావం;
భారతీయ వస్తువులపై ఆగస్టు 27 నుంచి(బుధవారం) 25 శాతం అదనపు సుంకాల అమలుకు సంబంధించిన వివరాలతో అమెరికా ఓ ముసాయిదా నోటీసును జారీచేసింది. భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే 4,800 కోట్ల డాలర్ల(సుమారు రూ. 4.20 లక్షల కోట్ల) విలువైన వస్తువులపై అదనపు సుంకాలు ప్రభావం చూపనున్నాయి. కొన్ని మినహాయింపులను పక్కనపెడితే అమెరికాలోకి ప్రవేశించే భారతీయ వస్తువులపై మొత్తం 50 శాతం సుంకాలు పడనున్నాయి. అమెరికా మొదట విధించిన 25 శాతం సుంకం ఆగస్టు 7న అమలులోకి రాగా రష్యా నుంచి ముడి చమురు, సైనిక పరికరాలు కొనుగోలు చేస్తున్నందుకు జరిమానాగా మరో 25 శాతం సుంకాలను ట్రంప్ ప్రభుత్వం విధించింది.
బుధవారం నుంచి ఈ అదనపు సుంకం అమలులోకి రానున్నది. ఆగస్టు 27 తెల్లవారుజామున(26వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత) 12.01 నుంచి భారతీయ వస్తువులపై అదనంగా విధించిన 25 శాతం సుంకాలు అమలులోకి రానున్నాయని అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం సోమవారం జారీచేసిన తన ముసాయిదా ఉత్తర్వులో తెలిపింది. అమెరికా నుంచి భారీ సుంకాలు ఎదుర్కోనున్న రంగాలలో జౌళి, వస్ర్తాలు, రత్నాలు, నగలు, రొయ్యలు, చర్మం, చెప్పులు, జంతు ఉత్పత్తులు, రసాయనాలు, విద్యుత్తు, మెకానికల్ యంత్రాలు మొదలైనవి ఉన్నాయి. ఈ అదనపు సుంకాల భారం పడని రంగాలలో ఫార్మా, ఇంధన ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్ వస్తువులు వంటివి ఉన్నాయి.
ఆగస్టు 27 తెల్లవారుజామున 12.01 లోపల లోడింగ్ అయి అమెరికాకు బయల్దేరిన నౌకలోని భారతీయ వస్తువులకు కొత్త 50 శాతం సుంకం నుంచి మినహాయింపు ఉంటుందని, అయితే అవి దేశంలో ఉపయోగించడానికి అనుమతి పొందడం లేదా గిడ్డంగి నుంచి వినియోగానికి బయల్దేరి ఉండినట్లయితే దీన్ని దిగుమతిదారుడు అమెరికా కస్టమ్స్‌కు సర్టిఫై చేయాల్సి ఉంటుందని ముసాయిదా ఉత్తర్వు వివరించింది. అమెరికా నుంచి 50 శాతం దిగుమతి సుంకాన్ని ఎదుర్కొంటున్న దేశాలలో భారత్‌తోపాటు బ్రెజిల్ కూడా ఉంది.
భారత్‌కు చెందిన దాదాపు 4,820 కోట్ల డాలర్ల విలువైన వస్తువులపై అదనపు సుంకాల భారం పడనున్నట్లు వాణిజ్య శాఖ తెలిపింది. అమెరికా చర్యను అనుచితం, అన్యాయం, అహేతుకంగా భారత్ ఆగస్టు 6న అభివర్ణించింది. అదనపు సుంకాల తర్వాత అమెరికాలో భారత్ పోటీదారులైన ఇతర దేశాలకు బాగా కలసివచ్చింది. భారత్ పోటీదారులైన మయన్మార్ (40 శాతం), థాయ్‌ల్యాండ్, కాంబోడియా(చెరో 36 శాతం), బంగ్లాదేశ్(35 శాతం), ఇండోనేషియా(32 శాతం), చైనా, శ్రీలంక(చెరో 30 శాతం) మొత్తం సుంకాలను ఎదుర్కొంటున్నాయి.