US-India Tariffs Row : భారత్‌తో సంబంధాలు వన్ సైడ్ డిజాస్టర్ అంటూ ట్రంప్ అక్కసు.
పుతిన్‌తో భేటీ అనంతరం ట్రంప్ నుంచి కామెంట్స్..
చైనాలో జరిగిన షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశంలో, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమావేశం జరిపిన తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి సంచలన వ్యాఖ్యలు వచ్చాయి. మరోసారి, ట్రంప్ తన అక్కసును భారత్‌పై వెళ్లగక్కుతూ, తాను విధించిన 50 శాతం సుంకాలను మరింతగా సమర్థించుకున్నాడు. భారత్-అమెరికా సంబంధాలను ‘‘ఏకపక్ష విపత్తు’’గా అభివర్ణిస్తూ తన కోపాన్ని రెట్టింపు చేశాడు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడం, సైనిక ఉత్పత్తులను కొనుగోలు చేయడం వల్లే సుంకాలు విధించాల్సి వచ్చిందని తన సోషల్ మీడియా పోస్టులో వెల్లడించారు.
అయితే, ఇదే కాకుండా మరిన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు ట్రంప్. భారత్ తన సుంకాలను తగ్గించుకోవడానికి ముందుకు వచ్చిందని, కానీ అప్పటికే ఆలస్యమైందంటూ పేర్కొన్నారు. ఇండియా దీనికి కొన్ని ఏళ్ల క్రితమే చేయాల్సిందని అన్నారు. ‘‘వారు (భారత్) మాతో అపారమైన వ్యాపారం చేస్తారు. భారీ మొత్తంలో మాకు వస్తువులు అమ్ముతారు. కానీ మేము వారికి తక్కువగా అమ్ముతాము. ఇప్పటి వరకు, ఇది పూర్తిగా ఏకపక్ష సంబంధం’’ అని ట్రంప్ ఆరోపించారు.
ట్రంప్ సుంకాలకు, బెదిరింపులకు ఇండియా భయపడకపోవడంతో ట్రంప్ పరిపాలన తీవ్రమైన అసహనంతో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతోనే భారత్‌పై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. చైనాతో భారత బంధాలు బలపడేందుకు ట్రంప్ పరోక్షంగా సాయం చేస్తున్నాడు. ట్రంప్ టారిఫ్స్ కారణంగా రెండు దేశాలు మరింత సహకరించుకోవాలని ఎస్‌సీఓ సమావేశంలో ఇరు దేశాధినేతలు అవగాహనకు వచ్చారు. ఇక, రష్యా అధినేత పుతిన్‌తో మోడీ చర్చలు అంతర్జాతీయంగా హెడ్‌లైన్స్‌గా మారాయి. రష్యా నుంచి చమురు కొంటామని ఇప్పటికే భారత్ స్పష్టం చేసింది.